న్యూఢిల్లీ : గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచార హోరు నేపధ్యంలో ఆప్, బీజేపీ నేతల నడుమ మాటల యుద్ధం ముదురుతోంది. ఢిల్లీ ఎడ్యుకేషన్ మోడల్‌ను ప్రస్తావిస్తూ ఆప్ నేతలు బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీ లక్ష్యంగా విమర్శలు గుప్పించారు.
— Arvind Kejriwal (@ArvindKejriwal) October 19, 2022
ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా డజనుకు పైగా విద్యార్ధులతో క్లాస్‌రూంలో కూర్చున్న ఫోటోను, ప్రధాని మోదీ కేవలం ఐదుగురు విద్యార్ధులతో కూర్చున్న ఫోటోను చూపుతూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రధాని లక్ష్యంగా మీమ్‌తో ట్వీట్ చేశారు. ఎలాంటి టెక్ట్స్ లేకుండా ఫోటోలతో కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
ఇక ప్రధాని మోదీని ట్రోల్ చేయడంలో తానేమీ తక్కువ తినలేదని మనీష్ సిసోడియా మరో ట్వీట్‌తో దాడి చేశారు. ప్రధానిని ఉద్దేశించి మీరు మమ్మల్ని జైలుకు పంపినా మేం మిమ్మల్ని స్కూల్‌కు పంపుతామని ట్వీట్ చేశారు. ఇక ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ స్కామ్ కేసులో మనీష్ సిసోడియాపై దర్యాప్తు ఏజెన్సీలు కన్నేశాయి. ఈ కేసులో అక్టోబర్ 17న మనీష్ సిసోడియాను సీబీఐ 9 గంటల పాటు ప్రశ్నించింది. తనపై సీబీఐ తప్పుడు కేసు నమోదు చేసిందని, బీజేపీ కుట్రలో భాగంగా విచారణను ముందుకుతెచ్చారని మనీష్ సిసోడియా ఆరోపించారు.