లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్, సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ)ల మధ్య పొత్తు ఖరారు కానుంది. ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్‌తో ఆప్ నేత సంజయ్ సింగ్ భేటీ అనంతరం ఈ విషయంపై స్పష్టత వచ్చింది. తాము ఇరు పార్టీల మధ్య పొత్తు దిశగా సంప్రదింపులు జరుపుతున్నామని ఆప్ నేత సంజయ్ సింగ్ వెల్లడించారు. ఇరువురు నేతల మధ్య లక్నోలో బుధవారం గంటకు పైగా చర్చలు ఆగాయి.
మరోవైపు ఎంఐఎంతో పొత్తు అవకాశాలపై అఖిలేష్ యాదవ్ స్పందించారు. ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీతో ఈ దిశగా సంప్రదింపులు జరపలేదని చెప్పారు. ఇక బీజేపీని మట్టికరిపించేందుకు ఎస్పీ చిన్న పార్టీలతో కలిసి ముందుకువెళుతుందని ఆ పార్టీ నేత సునీల్ సింగ్ సజన్ తెలిపారు. పూర్వాంచల్‌లో ఎలాంటి అభివృద్ధి పనులూ చేపట్టని కాషాయ పార్టీ తప్పుడు మోడల్‌ను ప్రజల ముందకు తీసుకువస్తోందని ఆయన ఆరోపించారు.