ఢిల్లీలోని జహంగీర్‌పూరీ హింసా ఘటనపై ఆప్, బీజేపీ మధ్య మాటల యుద్ధం సాగుతోంది. ఈ ఘటనతో సంబంధమున్న కీలక వ్యక్తి మహ్మద్ అన్సార్ విషయంలో ఈ రెండు పార్టీలూ ట్విట్టర్ వేదికగా విమర్శలు చేసుకుంటున్నాయి. అన్సర్ బీజేపీకి నేత అంటూ ఆప్ నేత అతిశీ ట్వీట్ చేశారు. అయితే బీజేపీ నేత మనోజ్ తివారీ…. అన్సర్‌కు ఆప్‌తో సంబంధాలున్నాయంటూ ప్రతి విమర్శ చేశారు. దీంతో ఇద్దరి మధ్యా మాటల యుద్ధం ముదిరింది. జహంగీర్‌పూరీ హింసాకాండలో ప్రధాన నిందితుడైన అన్సర్ బీజేపీ నేత. ఎన్నికల సమయంలో కీలక పాత్ర పోషించాడు. బీజేపీ అభ్యర్థి సంగీత బజాజ్ పోటీ సమయంలో ఆయన కీలక పాత్ర పోషించాడు. బీజేపీయే అల్లర్లు చేసిందని రూఢీ అయిపోయింది. ఢిల్లీ ప్రజలకు బీజేపీ క్షమాపణలు చెప్పాలి. బీజేపీ ఓ గూండాల పార్టీ అంటూ ఆప్ నేత ఆతిశీ ట్విట్టర్ వేదికగా ఫైర్ అయ్యారు.
కాదు.. ఆప్ నేతే.. బీజేపీ రివర్స్ కౌంటర్
జహంగీర్‌పూరీ అల్లర్లలో కీలక నిందితుడైన మహ్మద్ అన్సార్ ఆమ్ఆద్మీకి చెందిన వ్యక్తే అని బీజేపీ సీనియర్ నేత మనోజ్ తివారీ ట్విట్టర్ వేదికగా ఆరోపించారు. ఆప్ అల్లర్లు చేసే ఓ ఫ్యాక్టరీ అంటూ అభివర్ణించారు. జహంగీర్‌పూరీ అల్లర్ల మాస్టర్‌మైండ్ అన్సర్ ఆప్ వ్యక్తే. 2020 లో జరిగిన ఢిల్లీ అల్లర్ల సూత్రధారి కూడా ఆప్ వ్యక్తే. తాహీర్ హుస్సేన్… ఆప్ కౌన్సిలర్‌గా వున్నారు. ఆమ్ఆద్మీ అల్లర్ల ఫ్యాక్టరీ నడుపుతుందా? అక్రమ వలసదారులే ఢిల్లీ నగరానికి పెద్ద సమస్య అని అందరికీ తెలుసు. ఆప్ మాత్రం వారి విషయంలో ఉదాసీనంగా వుంది. మొత్తానికి జహంగీర్‌పూరీ అల్లర్ల సూత్రధారి మాత్రం ఆప్ వ్యక్తే అంటూ బీజేపీ నేత మనోజ్ తివారీ ఆరోపించారు.