న్యూఢిల్లీ, జనవరి 21: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు కోసం అధికార ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ, కాంగ్రెస్ శాయశక్తులా కృషి చేస్తున్నాయి. మూడోసారి అధికారాన్ని దక్కించుకునేందుకు ఆప్ ప్రయత్నిస్తుండగా, రాజధానిలో ఆమ్ ఆద్మీ పార్టీకి చెక్ పెట్టి అధికారాన్ని కైవసం చేసుకోవాలని కమలం పార్టీ, కాంగ్రెస్ శ్రమిస్తున్నాయి. ఓటర్లను ఆకట్టుకునేందుకు మూడు పార్టీలూ భారీగా హామీలు ప్రకటిస్తున్నాయి. పాత పథకాలను కొనసాగిస్తూ ఇంకొన్ని కొత్త పథకాలను అమలు చేస్తామని ఆప్ ఢిల్లీ ఓటర్లకు హామీలు ఇస్తున్నది. సంక్షేమ పథకాలతో ఢిల్లీవాసుల్లో ఆదరణ పొందిన కేజ్రీవాల్‌కు పథకాలతోనే చెక్ పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తున్నది.
గతంలో అనేకసార్లు ఉచిత పథకాలను విమర్శిస్తూ వచ్చిన ఆ పార్టీ ఢిల్లీలో మాత్రం అనేక హామీలను గుప్పిస్తున్నది. ఇప్పటికే ఒక మ్యానిఫెస్టోను విడుదల చేసిన కమలం పార్టీ.. మంగళవారం రెండో మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ప్రస్తుతం అమలులో ఉన్న పథకాలనూ కొనసాగిస్తామని హామీ ఇచ్చింది. ఈ రెండు పార్టీలకు ఏమాత్రం తగ్గకుండా కాంగ్రెస్ హామీలు ఇస్తున్నది. ఇప్పటికే ఎన్నికల్లో గెలిచేందుకు తెలంగాణ, కర్ణాటక, హిమాచల్ ప్రదేశ్‌లో ఆ పార్టీ ఇచ్చిన ఉచితాల హామీలు రాష్ర్టాలను ఆర్థికంగా దివాలా తీయిస్తున్నా కాంగ్రెస్ మాత్రం వెనక్కు తగ్గలేదు.