Aam Aadmi Party : దేశంలో అనేక చోట్ల ఇటీవలి కాలంలో ఓటములు ఎదుర్కొన్న ఆమ్ ఆద్మీ పార్టీకి ఊరట కలిగించే ఫలితాలు వెల్లడయ్యాయి. ఇటీవల పంజాబ్‌లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఘన విజయం సాధించింది. పంజాబ్‌లో ఈ నెల 26న 102 నగర పాలక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. వాటిలో 8 మున్సిపాలిటీలు, 75 మున్సిపల్ కౌన్సిల్లు, 19 నగర పంచాయతీలున్నాయి.
పంజాబ్‌లోని మున్సిపాలిటీల్లో దాదాపు సగం స్థానాల్ని ఆప్ కైవసం చేసుకుంది. ఇప్పటివరకు అందుతున్న సమాచారం ప్రకారం పంజాబ్‌లో మొత్తం 1,977 వార్డులకు ఎన్నికలు జరగగా 1,735 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో 850 స్థానాలకుపైగా ఆప్ కైవసం చేసుకుంది. మిగిలిన వాటిలో కాంగ్రెస్ 342, శిరోమణి అకాళీదర్ 165, బీజేపీ 131, బీఎస్పీ 6 స్థానాలు దక్కించుకోగా, ఇండిపెండెంట్లు, మిగతా చిన్న పార్టీలు కలిపి 241 సీట్లు దక్కించుకున్నాయి. ఈ ఫలితాలు ఆమ్ ఆద్మీ పార్టీకి భారీ ఊరట కలిగించేవే. ఇటీవల ఇతర రాష్ట్రాల్లోనూ ఆప్ ఓడిపోతూ వస్తోంది. మరోవైపు పంజాబ్‌లోనూ ఆప్ చతికిలపడిందన్న ప్రచారం మొదలైంది.
రాజ్యసభ ఎంపీలు ఆ పార్టీని వీడి బీజేపీలో చేరారు. దీంతో ఢిల్లీలో ఓడిపోయినట్లుగా రాబోయే ఎన్నికల్లో పంజాబ్‌లో కూడా ఆప్ పనైపోతుందనే ప్రచారం మొదలైంది. కానీ, స్థానిక సంస్థల్లో సత్తా చాటడంతో తిరిగి ఆమ్ ఆద్మీ పార్టీకి ఊపిరిపోసినట్లైంది. ఈ ఫలితాలు అనుకూలంగా రావడంతో వచ్చే ఏడాది జరగబోయే పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా సానుకూలంగా ఫలితాలు వస్తాయని ఆ పార్టీ పెద్దలు భావిస్తున్నారు. పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయం సాధించిన సందర్భంగా ఆప్ కీలక నేత, రాజ్యసభ ఎంపీ బీజేపీపై విమర్శలు గుప్పించారు. ఆ పార్టీని ఈడీ పార్టీగా అభివర్ణించారు. తమ పార్టీ ఎంపీలను లాక్కున్నప్పటికీ, బ్యాలెట్ పద్ధతిలో జరిగిన ఈ ఎన్నికల్లో బీజేపీ విఫలమైందన్నారు.