తిరువనంతపురం: లవ్ జిహాద్ బెదిరింపులు ఎదుర్కొన్న ప్రేమ జంట తమ ఊరి నుంచి పారిపోయారు. మరో రాష్ట్రానికి చేరుకున్నారు. హిందూ, ముస్లిం ఆచారాల ప్రకారం రెండుసార్లు పెళ్లి చేసుకున్నారు. తమకు రక్షణ కోసం హైకోర్టును ఆశ్రయించారు. (couple marry in Kerala) జార్ఖండ్‌లోని చితార్పూర్కు చెందిన మొహమ్మద్ గాలిబ్, ఆశా వర్మ చాలా కాలంగా ప్రేమించుకున్నారు. ఇరుగుపొరుగు కుటుంబాలకు చెందిన వారిద్దరికీ స్కూల్ నుంచి పరిచయం. అయితే వేరే మతాలకు చెందిన ఈ జంట మధ్య సంబంధాన్ని వారి కుటుంబాలు వ్యతిరేకించాయి.
కాగా, ఆశాకు మరో వ్యక్తితో పెళ్లి సంబంధం కుదుర్చుతున్నట్లు గాలిబ్‌కు తెలిసింది. దీంతో యూఏఈలో పని చేస్తున్న అతడు గత నెలలో జార్ఖండ్‌కు తిరిగివచ్చాడు. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. అయితే వేర్వేరు మతాలకు చెందడంతో ఇరు కుటుంబాలు నిరాకరించాయి. అలాగే లవ్ జిహాద్ ఆరోపణలు, బెదిరింపులను గాలిబ్, ఆశా ఎదుర్కొన్నారు.
మరోవైపు గాలిబ్, ఆశా కలిసి జార్ఖండ్ నుంచి పారిపోయారు. యూఏఈలోని గాలిబ్ ఫ్రెండ్ సలహా మేరకు కేరళకు చేరుకున్నారు. ఫిబ్రవరి 9న అలప్పుజలోని కాయంకుళంలో ఆశ్రయం పొందారు. ఫిబ్రవరి 11న స్థానిక మసీదులో ఇస్లామిక్ ఆచారాల ప్రకారం వారి వివాహం జరిగింది. ఫిబ్రవరి 16న హిందూ సంప్రదాయం ప్రకారం గుడిలో పెళ్లి చేసుకున్నారు.
కాగా, ఆశా అదృశ్యంపై ఆమె తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో గాలిబ్‌పై కిడ్నాప్ కేసు నమోదైంది. ఈ జంట కేరళ చేరుకున్నట్లు ఆశా తల్లిదండ్రులకు తెలిసింది. దీంతో జార్ఖండ్ పోలీసులతో కలిసి వారు కాయంకుళం చేరుకున్నారు.
అయితే ఈ జంట మేజర్లని స్థానిక పోలీసులు నిర్ధారించారు. తన ఇష్ట ప్రకారం గాలిబ్‌ను పెళ్లి చేసుకున్నట్లు ఆమె చెప్పింది. ఆశాను తమతో తీసుకెళ్లేందుకు తల్లిదండ్రులు ఒప్పించలేకపోయారు. దీంతో జార్ఖండ్ పోలీసులు ఆమె స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. చేసేదేమీ లేక వారంతా తిరిగి వెళ్లిపోయారు.
మరోవైపు కుటుంబాలను వ్యతిరేకించి మతాంతర వివాహం చేసుకున్న తమకు మరింతగా బెదిరింపులు వస్తాయని గాలిబ్, ఆశా భయాందోళన చెందారు. దీంతో రక్షణ కోరుతూ ఒక న్యాయవాది ద్వారా కేరళ హైకోర్టును ఆశ్రయించారు.