ముంబై, ఏప్రిల్ 22: మహారాష్ట్ర రాజధాని ముంబైలోని ప్రధాన రోడ్డులో రాజకీయ ర్యాలీ నిర్వహించి భారీ ట్రాఫిక్ జామ్‌ను సృష్టించిన మహారాష్ట్ర బీజేపీ మంత్రి గిరీష్ మహాజన్‌పై ఓ సామాన్య మహిళ విరుచుకుపడడం సంచలనం సృష్టించింది. ముంబైలోని వర్లి ప్రాంతంలో బుధవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళా రిజర్వేషన్ల బిల్లుపై నిరసన ర్యాలీ నిర్వహిస్తున్న బీజేపీకి చెందిన రాష్ట్ర మంత్రి గిరీష్ మహాజన్‌తో ఓ మహిళ తలపడింది.
ప్రధాన రోడ్డుపై ర్యాలీ నిర్వహించడం ద్వారా భారీ ట్రాఫిక్ జామ్‌కు కారకులైనందుకు మంత్రిపై ఆ మహిళ విరుచుకుపడ్డారు. వెంటనే ఇక్కడి నుంచి వెళ్లిపోండి(గెటౌట్ ఆఫ్ హియర్). మీ వల్ల ట్రాఫిక్ జామ్ ఏర్పడింది అంటూ ఆ మహిళ మంత్రిపై బిగ్గరగా అరిచారు. వాహనాల రాకపోకలకు అంతరాయం సృష్టిస్తూ ప్రధాన రహదారిపై ర్యాలీ నిర్వహించడానికి బదులు ఏ బహిరంగ మైదానంలో ర్యాలీ ఎందుకు జరుపుకోరు అంటూ ఆమె ప్రశ్నించారు. ఆమెకు నచ్చచెప్పేందుకు మంత్రి ప్రయత్నించగా ఆయన మాటలను ఆ మహిళ ఖాతరు చేయలేదు.
మీకు అర్థం కావడం లేదా? ఏమైంది మీకు? అక్కడ వందలాది మంది రోడ్డుపై వాహనాలతో నిలిచిపోయారు అంటూ ఆమె మంత్రిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓ పోలీసు అధికారి జోక్యం చేసుకోవడానికి ప్రయత్నించగా అతనితో మాట్లాడేందుకు ఆమె నిరాకరించారు. మీ సీనియర్ అధికారి ఎవరు అంటూ ఆమె ఆ అధికారిని నిలదీశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. ఆ మహిళ ధైర్యానికి నెటిజన్లు ప్రశంసల వర్షం కురిపించారు. బీజేపీ నిరసనలు తెలిపే విధానాన్ని కొందరు తప్పుపట్టారు.
వీడియో క్లిప్‌ను షేర్ చేసిన మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ మహిళా రిజర్వేషన్లపై అధికార పార్టీ ప్రచారం వాస్తవ దృశ్యాన్ని బట్టబయలు చేసిందని ఆరోపించారు. రాజకీయ లబ్ధి కోసం బీజేపీ మహిళలను తప్పుదారి పట్టిస్తున్నదని, తప్పుడు ప్రచారానికి ఈ అంశాన్ని వాడుకుంటున్నదని ఆయన విమర్శించారు.
వర్లిలో బీజేపీ నిర్వహించిన ర్యాలీ సందర్భంగా వాహనదారులు కొందరు అసౌకర్యానికి గురయ్యారని మంత్రి గిరీష్ మహాజన్ తెలిపారు. ట్రాఫిక్ జామ్‌పై తనతో వాగ్వివాదానికి దిగిన మహిళ అనుచిత భాషను ప్రయోగించారని ఆయన చెప్పారు. ఆ మహిళకు తాను అక్కడే క్షమాపణ చెప్పానన్నారు.