Viral news : భార్యాభర్తల మధ్య గొడవలు సహజమే. చాలామటుకు ఇలాంటి గొడవలు వెంటనే సమసిపోతుంటాయి. కానీ కొందరు దంపతుల మధ్య మాత్రం తీవ్ర స్థాయికి చేరుకుంటాయి. తాజాగా రాజస్థాన్లో అలాంటి గొడవే జరిగింది. భర్తతో గొడవపడిన ఓ మహిళ ఏకంగా అతని నాలుకలోని కొంత భాగాన్ని కొరికిపారేసింది. అతను నాలుక ముక్క పట్టుకుని ఆస్పత్రికి పరుగులు తీసేలా చేసింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్ రాష్ట్రం ఝలావర్ జిల్లాలోని బకానీ పట్టణానికి చెందిన కన్హయలాల్ సైన్ (25), రవీనా సైన్ (23) ఇద్దరూ భార్యాభర్తలు. పట్టణానికి సమీపంలోని సునేల్ గ్రామానికి చెందిన రవీనా సైన్ను ఏడాదిన్నర క్రితమే కన్హయలాల్ సైన్ వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన దగ్గర నుంచి ఇద్దరి మధ్య నిత్యం గొడవలే జరుగుతున్నాయి. ఈ క్రమంలో గురువారం రాత్రి కూడా భార్యాభర్తలు గొడవపడ్డారు.
ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ తీవ్రమైంది. దాంతో కోపం పట్టలేకపోయిన రవీనా సైన్ తన భర్త నాలుకలో కొంత భాగాన్ని కొరికేసింది. అనంతరం ఓ గదిలోకి వెళ్లి తలుపేసుకుని ఎడమచేతి మణికట్టును కోసుకునేందుకు ప్రయత్నించింది. గమనించిన బంధువులు తలుపులు పగులగొట్టి ఆమె నుంచి కత్తిని గుంజుకున్నారు. వెంటనే కన్హయలాల్ సైన్ను ఆస్పత్రికి తరలించారు.
పరిశీలించిన వైద్యులు తెగిపోయిన కన్హయలాల్ నాలుకను కలిపి కుట్టేశారు. కన్హయ సోదరుడి ఫిర్యాదు మేరకు ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. చట్ట ప్రకారం రవీనాపై చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బాధితుడు మాట్లాడే పరిస్థితిలో లేకపోవడంతో అతడి నుంచి వాంగ్మూలం తీసుకోవడం సాధ్యం కాలేదని చెప్పారు. బాధితుడి వాంగ్మూలం అనంతరం నిందితురాలిని అరెస్టు చేయనున్నట్లు తెలిపారు.