Village Missing | ఏదైనా ఒక ఊరు ప్రభుత్వ రికార్డుల్లో ఉంటేనే ఆ ఊరి వాళ్లకు అన్ని సంక్షేమ పథకాలు అందుతాయి. అయితే, మధ్యప్రదేశ్‌లోని ఓ గ్రామం కనిపించడం లేదంట. ఆ గ్రామం ప్రభుత్వ రికార్డుల్లో లేదు. దాంతో ఆ గ్రామస్థులకు ఇప్పటివరకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదు. చివరకు గ్రామస్థుల పిల్లలకు కూడా ఎలాంటి గుర్తింపుకార్డులు అందడం లేదు. అచ్చం ఇలాంటి సీన్లే మనం అక్షయ్‌కుమార్, సోనాక్షి సిన్హా నటించిన ‘జోకర్’ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్ స్వగ్రామం ‘పాగల్పూర్’ మూడు రాష్ట్రాల సరిహద్దులో ఉండటంతో ఏ రాష్ట్ర ప్రభుత్వమూ పట్టించుకోదు. దాంతో తన గ్రామాన్ని ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కించి చివరకు హీరో విజయం సాధిస్తాడు.
మధ్యప్రదేశ్ గుణ జిల్లాలో జిల్లా కేంద్రానికి దాదాపు 90 కిలో మీటర్ల దూరంలో ఉదయపురా గ్రామం ఉంటుంది. ఈ ఊరు గతంలో మధుసూదన్గఢ్ కింద ఉండేది. డీలిమిటేషన్లో పంచాయతీ కాస్తా నగర కౌన్సిల్లో విలీనమైంది. దాంతో ఈ గ్రామాన్ని మరో పంచాయతీ కిందకు చేర్చారు. అయితే మ్యాపింగ్ మాత్రం చేయలేదు. దాంతో ఈ గ్రామం పేరు ప్రభుత్వ రికార్డుల్లోకి ఎక్కలేదు. ఒక్క సంక్షేమ కార్యక్రమం జరగక అభివృద్ధి నిలిచిపోయింది. బడిలో చిన్నారుల అడ్మిషన్ కూడా జరగడం లేదు. మా ఊరు చోరీకి గురైనట్లు తెలుస్తున్నదని గ్రామస్తులు చెప్తున్నారు.
ఉదయపురా గ్రామంలో దాదాపు 450 మంది జనాభా ఉండగా.. 300 మంది ఓటర్లు నమోదయ్యారు. తొలుత ఈ ఊరు తొరాయి గ్రామపంచాయతీ పరిధిలో ఉండేది. మధుసూదన్గఢ్ను మున్సిపల్ కౌన్సిల్‌గా చేసి 4 పంచాయతీలను చేర్చారు. తొరాయి గ్రామం కూడా కౌన్సిల్లో చేరింది. దాంతో ఈ హామ్లెట్ గ్రామమైన ఉదయపురాను గ్రామంగా మ్యాపింగ్ చేయలేదు. ఫలితంగా ప్రభుత్వ రికార్డుల నుంచి ఉదయపురా కనిపించకుండా పోయింది. ప్రస్తుతం జిల్లా అధికారులు సెర్చ్ చేస్తే తొరాయి గ్రామం కింద ఉన్నట్లుగానే ఆన్లైన్లో కనిపిస్తుంది. కరేలా కింద లేకుండా.. తొరాయిలో ఉంచకపోవడంతో గత కొంతకాలంగా ఈ గ్రామంలో అభివృద్ధి కానరావడంలేదు. ఎలాంటి ప్రభుత్వ పథకమూ ఈ గ్రామ ప్రజలకు అందడం లేదు.