Pahalgam : పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror Attack) యావత్ భారతదేశాన్ని ఉలిక్కిపడేలా చేసింది. ప్రపంచ దేశాలు ఈ దాడిని తీవ్రంగా ఖండించాయి. ఈ ఉగ్రదాడి వెనుక పాకిస్థాన్ (Pakistan) హస్తం ఉన్నట్లు ఆధారాలు లభించడంతో రెండు దేశాల మధ్య పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో భద్రతా బలగాలు భద్రతను కట్టుదిట్టం చేశాయి. దాడికి పాల్పడిన ముష్కరుల కోసం ముమ్మరంగా గాలింపులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో ఉగ్రదాడి జరిగిన ప్రాంతంలో మంగళవారం సాయంత్రం కలకలం చెలరేగింది.
ఉగ్రదాడి జరిగిన బైసరన్ లోయ సమీపంలో ఓ వ్యక్తి బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ ధరించి అనుమానాస్పదంగా తచ్చాడుతుండటంతో భద్రతా బలగాలు అతడిని అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం అతడిని విచారించగా పొంతన లేని సమాధానాలు చెప్పాడు. బుల్లెట్ ఫ్రూఫ్ జాకెట్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగితే కూడా సమాధానం చెప్పలేదు. దాంతో అతడిని పోలీసులకు అప్పగించారు. కాగా పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు పాశవిక దాడికి పాల్పడ్డారు.
ఈ ఉగ్రదాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ‘ది రెసిస్టెన్స్ ఫ్రంట్’ ప్రకటించుకుంది. ఇది పాకిస్థాన్ కేంద్రంగా పనిచేస్తున్న లష్కరే తోయిబాకు ఉగ్రవాద సంస్థకు అనుబంధ సంస్థ. అందుకే దీన్ని భారత ప్రభుత్వం గతంలోనే ఉగ్ర సంస్థగా ప్రకటించింది. ఈ క్రమంలో దాడికి తామే బాధ్యులమని ది రెసిస్టెన్స్ ఫ్రంట్ ప్రకటించుకోవడం భారత్‌కు పాకిస్థాన్‌పై ఆగ్రహం తెప్పించింది. ఆ దేశాన్ని అన్ని వైపుల నుంచి దిగ్బంధించింది. దాంతో ఇరుదేశాల సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది.