Freebies | న్యూఢిల్లీ, జనవరి 25: ఇటీవలి కాలంలో దేశంలోని పలు రాష్ర్టాల ఎన్నికల్లో మహిళా ఓటర్లను లక్ష్యంగా చేసుకుని వివిధ రాజకీయ పార్టీలు ఎడాపెడా హామీలను గుమ్మరిస్తున్నాయి. తమను గెలిపిస్తే నేరుగా వారి ఖాతాల్లోకి నగదు జమ చేస్తామంటూ మభ్య పెడుతున్నాయి. ఇటీవల తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సైతం ఇదే వాగ్దానం చేసి అధికారం చేపట్టినా తర్వాత ఆ పథకం ఊసే ఎత్తడం లేదు. ఈ క్రమంలో నేరుగా ఖాతాల్లోకి నగదు జమ లాంటి పథకాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక పరిస్థితిపై తీవ్ర ప్రభావం చూపుతాయని, ఖజానాకు చిల్లులు తప్పవని, నగదు బదిలీ పథకాలు ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బ తీయవచ్చునని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) చేసిన సర్వే హెచ్చరిస్తున్నది.
‘ప్రత్యక్ష బదిలీ ప్రయోజనాలను అందించే కొన్ని రాష్ర్టాల్లో (అందులో కొన్ని ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాజకీయాల కోసం ఉద్దేశించినవి) మహిళా కేంద్రీకృత పథకాల సునామీ ఉంది. అవి ఆ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి’ అని నివేదిక పేర్కొంది. దేశంలోని 8 రాష్ర్టాల్లో ఈ పథకాల ఖర్చు 1.5 లక్షల కోట్ల రూపాయలను దాటినట్టు వెల్లడించింది. ఈ మొత్తం ఆయా రాష్ర్టాల ఆదాయంలో 3 నుంచి 11 శాతం ఉందని తెలిపింది.
ఒడిశా లాంటి రాష్ర్టాల్లో పన్నుయేతర ఆదాయాలతో పాటు రుణాలపై ఆంక్షలు లేకపోవడంతో పరిస్థితి బాగానే ఉన్నా మిగిలిన రాష్ర్టాలు తీవ్ర ఆర్థిక సవాళ్లను ఎదుర్కోవచ్చునని ఎస్బీఐ తన నివేదికలో హెచ్చరించింది. ఈ సందర్భంగా కర్ణాటక పరిస్థితిని ఉదహరించింది. ఈ రాష్ట్రంలోని గృహలక్ష్మీ పథకాన్ని తీసుకుంటే దాని కింద ప్రతి మహిళకు నెలకు రూ.2,000 వారి ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఈ పథకానికి రూ.28,608 కోట్లను కేటాయించారు. ఇది ఆ రాష్ట్ర రెవెన్యూ రాబడిలో 11 శాతం. ఇంత మొత్తం కేటాయించలేక ఆ రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నది, రెవెన్యూ లోటును సవరించడానికి ప్రజలపై వివిధ పన్నుల భారాన్ని మోపుతున్నది.
ఎన్నికల్లో గెలవడానికి రాష్ర్టాలు ఎడాపెడా నగదు బదిలీ పథకాలకు హామీలు గుప్పిస్తుండటంతో కేంద్రంపై కూడా ఒత్తిడి పెరుగుతున్నది. అది కూడా ఇలాంటి పథకాలను అమలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతున్నది. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మహిళా సాధికారిత పేరుతో నగదు బదిలీ పథకాలు ప్రవేశపెట్టే ముందు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు, పార్టీలు ఆ రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక శక్తి, రుణ లభ్యత, వాటికి కేటాయించాల్సిన బడ్జెట్ మొత్తం తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ఎప్బీఐ నివేదిక సూచిస్తున్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ర్టాలకు సమానమైన గ్రాంట్లతో కూడిన సార్వత్రిక ఆదాయ బదిలీ పథకం ప్రస్తుత విధానానికి మరింత స్థిరమైన ప్రత్యామ్నాయంగా ఉండవచ్చునని ఈ నివేదిక సూచిస్తున్నది. ఇది ఆర్థిక పరిస్థితికి అంతరాయం కలిగించే సబ్సిడీలను కూడా తగ్గించడంలో సహాయపడుతుందని నివేదిక పేర్కొంది.