China | హైదరాబాద్, జనవరి 30 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): చైనాలో రియల్ ఎస్టేట్ సంక్షోభం తారాస్థాయికి చేరుకొన్నది. ఎంతలా అంటే ‘ఇల్లు కొనండి.. భార్యను ఉచితంగా పొందండి’ అంటూ నిర్మాణ సంస్థలు ప్రకటనలు ఇచ్చి కస్టమర్లను ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి మరి. టియాంజన్‌కు చెందిన ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ ఈ తరహా వింత ప్రచారం ప్రారంభించింది. చైనాలో గతంలో బాగా ప్రాచుర్యం పొందిన ‘ఇల్లు కొని.. మీ భార్యకు కానుకగా ఇవ్వండి’ వాక్యాలను మార్చిన సదరు కంపెనీ ‘ఇల్లు కొనండి.. వైఫ్‌ను ఫ్రీగా పొందండి’ అంటూ హోరెత్తించింది.
చైనాలో ఇండ్లకు గిరాకీ లేకపోవడంతో పాటు అక్కడి యువకులు వివాహాలు, సంతానం పట్ల అనాసక్తితో ఉన్నారు. దీంతో ఈ కంపెనీ ఇలాంటి వింత ప్రచారానికి తెరతీసింది. ఈ విషయం గత సెప్టెంబర్‌లో ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో సదరు కంపెనీకి తాజాగా 4,184 డాలర్ల జరిమానా విధించింది. నిర్మాణం జరిగిన తమ ఇండ్లను విక్రయించడానికి తూర్పు జిజియాంగ్ ప్రావిన్స్‌కు చెందిన మరో కంపెనీ ఇల్లు కొనే వ్యక్తి ప్రేయసి లేదా ప్రియుడికి పది గ్రాముల బంగారు గొలుసును బహుమతిగా ఇస్తామంటూ మరో ఆఫర్‌ను ప్రకటించింది.
చైనా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉండే స్తిరాస్థి రంగం ఇప్పుడు గడ్డు పరిస్థితులను ఎదుర్కొంటున్నది. 2021లో స్తిరాస్థి రంగ దిగ్గజం ఎవర్‌గ్రాండె సంక్షోభంలో పడిన నాటి నుంచి ఈ రంగం తీవ్ర ఒడిదొడుకులను చవిచూస్తున్నట్టు స్తిరాస్థి రంగ నిపుణులు చెబుతున్నారు. ఎవర్‌గ్రాండె తర్వాత కంట్రీ గార్డెన్ హోల్డింగ్స్ వంటి సంస్థలు కూడా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోవడం, నిరుద్యోగం, ఆర్థిక మాంద్యం భయాలు, ఆర్థిక స్థిరత్వం లేకపోవడంతో యువత పెండ్లిళ్లకు విముఖత చూపిస్తుండటం, బ్యాంకుల నుంచి గృహరుణాలు తీసుకోవడంలో అనాసక్తి వెరసి గత ఆగస్టు చివరి నాటికి దేశవ్యాప్తంగా 900 చదరపు అడుగులు ఆపై విస్తీర్ణం కలిగిన దాదాపు 72 లక్షల కొత్త ఇండ్లు విక్రయాలు జరుగకుండా ఉన్నట్టు నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ గణాంకాల్లో తేలింది. కిందటేడాది గృహ విక్రయాలు 6 శాతం మేర పడిపోయాయని.. బీజింగ్, షాంఘై, గౌంగ్ఝా, షెంజెన్ తదితర ప్రధాన నగరాల్లో ఒక్క డిసెంబర్ నెలలోనే ఇండ్ల అమ్మకాలు 11 శాతం నుంచి 14 శాతం మేర పడిపోయినట్టు వెల్లడించింది.
చైనాలో పారిశ్రామిక విప్లవం నేపథ్యంలో గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలు పెద్దయెత్తున నగరాలు, పట్టణాలకు వలస రావడం ప్రారంభించారు. దీంతో వారికి అవసరమైన ఆవాసాలను ఏర్పాటు చేయడానికి రియల్ ఎస్టేట్ కంపెనీలు పుట్టగొడుగుల్లా వెలిశాయి. నగర శివారు ప్రాంతాల్లో పెద్దయెత్తున ఇండ్ల నిర్మాణాలు చేపట్టాయి. ఇలా జీడీపీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా కలిపి రియల్ ఎస్టేట్ వాటా 29 శాతం వరకూ ఎగబాకింది. ఈ సమయంలోనే దేశంలోని చాలామంది సంపన్నులు, వారికి చెందిన కంపెనీలు.. ఇండ్లు, ఆకాశహార్మ్యాలను కొనుగోలు చేశాయి.
అయితే, గృహ కొనుగోళ్లపై వినియోగదారులు అసక్తి కనబర్చకపోవడంతో అటు రియల్ ఎస్టేట్ సంస్థలు, ఇటు సంపన్నుల కంపెనీలు కొనుగోలు చేసిన ఇండ్లన్నీ ఖాళీగా ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. అలా కంగ్బాషి, తియాంజెన్లో బిన్హయి న్యూ ఏరియా, జాంగ్జూలోని జెంగ్గాంగ్ న్యూడిస్ట్రిక్ట్, ఇన్నర్ మంగోలియాలోని క్వింగ్స్ హుయి, యునాన్ ప్రావిన్స్‌లోని పలు పట్టణాల శివారు ప్రాంతాల్లో నిర్మించిన గేటెడ్ కమ్యూనిటీల్లోని ఇండ్లు అమ్మకాలు జరుగక ‘ఘోస్ట్ సిటీ’లుగా మిగిలిపోయాయి.