Maharashtra | ముంబై : స్కూల్కు ఆలస్యంగా వచ్చిందని చెప్పి ఓ విద్యార్థిని పట్ల పాఠశాల యాజమాన్యం కఠినంగా ప్రవర్తించింది. సదరు విద్యార్థిని చేత 100 గుంజిలు తీయించారు. దీంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలిక వారం రోజుల పాటు చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. ఈ విషాద ఘటన మహారాష్ట్ర పాల్ఘర్ జిల్లాలో వెలుగు చూసింది.
పాల్ఘర్ జిల్లాలోని ఓ ప్రయివేటు స్కూల్లో చదువుతున్న ఓ నలుగురు విద్యార్థినులు నవంబర్ 8వ తేదీన పాఠశాలకు ఆలస్యంగా వెళ్లారు. దీంతో స్కూల్ యాజమాన్యం వారి పట్ల అమానవీయంగా ప్రవర్తించారు. విద్యార్థినుల చేత 100 గుంజిలు తీయించారు. వీరిలో ఒక విద్యార్థిని తీవ్ర అస్వస్థతకు గురైంది. అప్రమత్తమైన తల్లిదండ్రులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పయింది బాలిక.
పాఠశాల యాజమాన్యం విధించిన కఠిన శిక్ష వల్లే తమ బిడ్డ ప్రాణాలు కోల్పోయిందని తల్లి ఆరోపించింది. పుస్తకాల బ్యాగు వీపుపై ఉంచి గుంజిలు తీయించడంతో వెన్నెముక నొప్పిగా ఉందని, నడవలేని స్థితిలోకి తమ బిడ్డ వెళ్లిపోయిందని తెలిపింది. తమ బిడ్డ మృతికి కారణమైన టీచర్లపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ అధికారులను డిమాండ్ చేసింది. ఈ ఘటనను సీరియస్గా తీసుకున్న విద్యాశాఖ అధికారులు విచారణకు ఆదేశించారు.