AIADMK | చెన్నై, సెప్టెంబర్ 25: మరో కొద్ది నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో కేంద్రంలోని అధికార ఎన్డీయే కూటమికి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు చెందిన అన్నాడీఎంకే పార్టీ ఎన్డీయే కూటమి నుంచి వైదొలగుతున్నట్టు సోమవారం సాయంత్రం ప్రకటించింది. బీజేపీతో తెగదెంపులు చేసుకోవాలని చెన్నైలో జరిగిన పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, జిల్లా నాయకుల సమావేశంలో ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నామని అన్నాడీఎంకే డిప్యూటీ ప్రధాన కార్యదర్శి కేపీ మునుస్వామి తెలిపారు. వచ్చే ఎన్నికల్లో కొత్త ఫ్రంట్‌తో బరిలోకి దిగుతామని తెలిపారు. ఈ వార్త వెలువడిన వెంటనే పార్టీ శ్రేణులు పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు.
ధన్యవాదాలు.. దయచేసి మళ్లీ రాకండి
తమ దివంగత నేతలు అన్నాడీఏంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్‌కు గురువుగా పేరొందిన అన్నాదురైని, మాజీ సీఎం జయలలితను ఉద్దేశించి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆ పార్టీకి ఆగ్రహం కలిగించింది. ఢిల్లీలో శనివారం బీజేపీ అగ్రనేతలతో జరిగిన భేటీలో.. అన్నామలై భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేదా ఆయనను పార్టీ అధ్యక్ష పదవి నుంచి తొలగించి వేరొకరిని నియమించాలని అన్నాడీఎంకే నేతలు డిమాండ్ చేశారు. అన్నామలైని తొలగించేందుకు బీజేపీ ససేమిరా అనడంతో ఇక వారితో తెగదెంపులు చేసుకోవాలని నిర్ణయించినట్టు మునుస్వామి తెలిపారు. తమిళనాడు ఎన్నికలలో ఇంతవరకు ఎటువంటి ప్రభావం చూపని బీజేపీని ఇకపై కూడా కాలుపెట్టనివ్వబోమని మరో నాయకుడు డీ జయకుమార్ హెచ్చరించారు. పార్టీ అధికార ట్విట్టర్ హ్యాండిల్లో ‘నంద్రి_మీండుం వరతీరగల్ (ధన్యవాదాలు.. దయచేసి మళ్లీ రాకండి) అని బీజేపీని ఉద్దేశించి కార్యకర్తలు పోస్ట్ చేశారు.
బీజేపీతో జట్టుకట్టిన ప్రతిసారీ ఓటమే!
బీజేపీతో పొత్తు పెట్టుకున్న ప్రతిసారీ అన్నాడీఎంకే ఓటమి చెందడం గమనార్హం. 2019 లోక్‌సభ, 2021 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ-అన్నాడీఎంకే కూటమి డీఎంకే చేతిలో దారుణంగా పరాభవం పొందింది. గత లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే 37 సీట్ల నుంచి ఒక స్థానానికి, అసెంబ్లీ ఎన్నికల్లో 136 నుంచి 75 సీట్లకు దిగజారింది. బీజేపీ కనీసం తన ఉనికిని కూడా చాటుకోలేకపోయింది.