న్యూఢిల్లీ, జూలై 30: బరువుగా ఊపిరి తీసుకునేలా చేసే శారీరక శ్రమ రోజులో నాలుగైదు నిమిషాలు చేసినా క్యాన్సర్ ముప్పు 32 శాతం తగ్గుతుందని తాజా అధ్యయనం ఒకటి వెల్లడించింది. ‘జామా ఆంకాలజీ’ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. ఆస్ట్రేలియాలోని సిడ్నీ యూనివర్సిటీ పరిశోధకులు వ్యాయామం చేయని 22 వేల మంది రోజువారీ కార్యకలాపాలకు సంబంధించిన డాటాను సేకరించారు. ఆ తర్వాత వారి ఏడేండ్ల క్లినికల్ హెల్త్ రికార్డులు సేకరించి క్యాన్సర్‌పై అధ్యయనం చేశారు. ఈ సందర్భంగా ఓ అద్భుతమైన విషయాన్ని వారు గుర్తించారు. అడపాదడపా రోజులో నాలుగైదు నిమిషాలు చేసే తీవ్రమైన శారీరక శ్రమ (వీఐఎల్పీఏ) క్యాన్సర్ ముప్పును గణనీయంగా తగ్గించినట్టు కనుగొన్నారు.
కనీసం నిమిషం వ్యవధి ఉండే ఇంటిపని, షాపింగ్‌లో అధిక బరువు మోయడం, పిల్లలతో కలిసి హై ఎనర్జీ గేమ్స్ ఆడడం వంటి కారణాలతోనే వారిలో క్యాన్సర్ రిస్క్ తగ్గినట్టు గుర్తించారు. అస్సలు వ్యాయామం చేయని పెద్దల్లో రొమ్మ, ఎండోమెట్రియల్ (మహిళల్లో యుటెరస్ పొరకు వచ్చేది) వంటి క్యాన్సర్లు వచ్చే ప్రమాదం ఉందని గతంలో బోల్డన్ని అధ్యయనాలు హెచ్చరించాయి. అయితే, తాజా పరిశోధనలో రోజులో నాలుగైదు నిమిషాల తీవ్ర శారీరక శ్రమ వల్ల క్యాన్సర్ ముప్పు తగ్గుతుందని తేలింది. మధ్యవయసు వారిలో అత్యధికులు రోజువారీ వ్యాయామాలు చేయరన్న విషయం తమకు తెలుసని అధ్యయానికి నేతృత్వం వహించిన ప్రొఫెసర్ ఎమ్మాన్యుయేల్ స్టమాటకిస్ పేర్కొన్నారు. అయితే, ఒక్కోటి కనీసం నిమిషం నిడివి ఉన్న షార్ట్ బరస్ట్‌లు నాలుగైదు నిమిషాలు చేస్తే క్యాన్సర్ రిస్క్ 18 శాతం తగ్గుతుందని, శారీరక శ్రమతో ముడిపడి ఉన్న క్యాన్సర్ల ముప్పు 32 శాతం తగ్గుతుందని వివరించారు.