న్యూఢిల్లీ, జూన్ 22: కృత్రిమ మేధ(ఏఐ) నైపుణ్యాలు, అవగాహన ఉన్న వారికే ఉద్యోగ, కెరీర్ అవకాశాల్లో కంపెనీలు ప్రాధాన్యమిస్తున్నాయని మైక్రోసాఫ్ట్, లింక్డ్ఇన్ తాజా అధ్యయనం వెల్లడించింది. ఏఐ నైపుణ్యాలు లేని వారు అవకాశాల వేటలో వెనుకబడి ఉన్నారని తెలిపింది. 31 దేశాలకు చెందిన 30 వేల మందిపై ఈ అధ్యయనం నిర్వహించారు. దాదాపు 70 శాతం యాజమాన్యాలు నియామకాల విషయంలో నిర్ణయం తీసుకొనే సమయంలో సంప్రదాయ నైపుణ్యాలు ఉన్న వారి కంటే ఏఐపై అవగాహన ఉన్న వారి వైపు మొగ్గు చూపుతున్నాయని అధ్యయనం వెల్లడించింది.
లింక్డ్ఇన్ ఉపాధ్యక్షుడు అనీశ్ రమన్ మాట్లాడుతూ ప్రాంప్ట్ ఇంజినీరింగ్, మెషిన్ లెర్నింగ్ లేదా డాటా లిటరసీ వంటి ప్రాథమిక ఏఐ నైపుణ్యాలను నేర్చుకోవడం ఎక్కువ అనుభవం ఉన్న ఇతర ఉద్యోగులతో పోటీని తగ్గిస్తుందని అభిప్రాయపడ్డారు. ఏఐ అవగాహన ఉన్న యువ అభ్యర్థులు ముఖ్యంగా జనరేషన్-జెడ్ వాళ్లకు(1996-2010 మధ్య జన్మించిన వాళ్లు) తమ తోటి వాళ్ల కంటే ఎక్కువ ప్రయోజనాలు, అవకాశాలు పొందే అవకాశం ఉంటుందని నిపుణులు అంటున్నారు.