న్యూఢిల్లీ, జూలై 30: భూతాపం (గ్లోబల్ వార్మింగ్) కారణంగా ప్రపంచం కుదేలవుతున్నది. పెరుగుతున్న ఉష్ణోగ్రతల కారణంగా భూమి సలసల కాగుతున్నదని ఇటీవల ఓ నివేదిక పేర్కొనగా.. వాతావరణం వేడెక్కుతుండటంతో మంచు పలకలు కరుగుతున్నట్టు తాజాగా ఓ రిపోర్టులో వెల్లడైంది. అంటార్కిటికాలో హిమ పలకలు భారీగా మాయమవుతున్నట్టు కొలరాడోలోని నేషనల్ స్నో అండ్ ఐస్ డాటా సెంటర్ (ఎన్ఎస్ఐడీసీ) తెలిపింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుత జూలైలో 16 లక్షల చదరపు కి.మీ మంచు పలకలు తక్కువగా ఉన్నట్టు ఎన్ఎస్ఐడీసీ పేర్కొంది. 45 ఏండ్ల రికార్డులను పరిశీలిస్తే ప్రస్తుతం అక్కడ కనిష్ఠ స్థాయిలో మంచు ఉందని వెల్లడించింది. సాధారణంగా అంటార్కిటికా ఖండంలో ఫిబ్రవరిలో వేసవి కారణంగా మంచు కరిగి, శీతాకాలం నాటికి తిరిగి మంచు ఏర్పడుతుందని ఆ సంస్థ తెలిపింది. కానీ ప్రస్తుతం అందుకు భిన్నమైన పరిస్థితులు అక్కడ ఉన్నాయని పేర్కొంది. 1981-2010 వరకు రికార్డులను చూస్తే సగటున 26 లక్షల చదరపు కి.మీ మంచు పలకలు మాయమైనట్టు తెలిపింది. ఇది అర్జెంటీనా, కాలిఫోర్నియా, న్యూ మెక్సికో, అరిజోనా, నెవాడా, కొలరాడోలతో సమానమని వివరించింది.