న్యూఢిల్లీ, ఏప్రిల్ 14: ఒక పక్క లోక్సభ, శాసనసభలలో మహిళలకు రిజర్వేషన్లు కల్పించే దిశగా అడుగులు పడుతున్న తరుణంలో దివ్యాంగులకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని దివ్యాంగుల హక్కుల సంస్థ ది నేషనల్ సెంటర్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఫర్ డిజేబుల్డ్ పీపుల్ (ఎన్సీపీఈడీపీ) మంగళవారం నొక్కి చెప్పింది. ఈ అంశంపై జాతీయ స్థాయిలో చర్చ జరగాల్సిన అవసరం ఉందని పేర్కొన్నది.
ఎన్సీపీఈడీపీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అర్మాన్ అలీ మాట్లాడుతూ వైకల్యాన్ని ఇప్పటికీ సమాన భాగస్వామ్యం, హక్కుల సమస్యగా కాకుండా సంక్షేమ కోణంలోనే చూస్తున్నారని అన్నారు. మీరు వైకల్యాన్ని ఒక ఖర్చుగా మాత్రమే చూస్తుంటే పెన్షన్ ఇవ్వండి, ఉచితాలు, ఉపకరణాలు, స్కాలర్షిప్లు పంపిణీ చేయండి, అది ముఖ్యమే. కానీ నా వాదనేమిటంటే వికలాంగులను ఎప్పుడే చివరిగానే పరిగణిస్తారు. మాకు సమాన అవకాశాలు లభించేంత వరకు ఈ పరిస్థితి మారదని అలీ అన్నారు. చట్టసభలలో దివ్యాంగులకు ప్రత్యేక రిజర్వేషన్లు కల్పించే అంశాన్ని పరిశీలించాలని ఆయన కోరారు.