న్యూఢిల్లీ: ప్రముఖ సామాజిక మాధ్యమం ‘ట్విట్టర్’ (ప్రస్తుతం ‘ఎక్స్’) మాజీ సహ వ్యవస్థాపకుడు, ‘బ్లాక్’ సంస్థ సీఈవో జాక్ డోర్సీ సరికొత్త మెసేజింగ్ యాప్‌ను లాంచ్ చేశారు. ‘బిట్‌చాట్’ పేరుతో ప్రారంభించిన ఈ యాప్ ప్రపంచ టెక్ వర్గాల్లో ఆసక్తి రేపుతున్నది. ఇది ఇంటర్నెట్పై ఆధారపడకుండా బ్లూటూత్‌ను ఉపయోగించుకుని పనిచేసే ఆఫ్‌లైన్ టెక్స్టింగ్ యాప్. బ్లూటూత్ ద్వారా ఆఫ్‌లైన్‌లో సందేశాలను పంపేందుకు ‘బిట్‌చాట్’ వీలుకల్పిస్తుంది.
అంటే మీరు మొబైల్ డాటా లేదా వైఫైతో పని లేకుండానే ఇతరులతో చాట్ చేయవచ్చు. నెట్వర్క్ కనెక్షన్ బలహీనంగా ఉన్నప్పుడు లేదా కనెక్షన్ లేనప్పుడు ఈ యాప్ ఎంతో అనుకూలమైన ఆప్షన్‌గా ఉంటుంది. తక్కువ దూరంలో ఉన్న డివైజ్‌లు ఒకదానితో మరొకటి నేరుగా కనెక్ట్ అయ్యేందుకు ‘బిట్‌చాట్’ వీలుకల్పిస్తుంది.
ఇందుకు సెంట్రల్ సర్వర్లు, ఫోన్ నంబర్లు, ఇంటర్నెట్ లేదా ఈ-మెయిల్ అడ్రస్ లాంటివేమీ అక్కర్లేదు. ప్రజలు తమ ఫోన్లతో తిరుగుతున్నప్పుడు ఈ యాప్ బ్లూటూత్‌ను ఉపయోగించి సమీపంలోని డివైజ్‌లను కనెక్ట్ చేయడం ద్వారా ఓ గ్రూప్‌ను ఏర్పరుస్తుంది. ప్రస్తుతం బీటా టెస్టింగ్ దశలో ఉన్న ఈ యాప్ ‘యాపిల్’ టెస్ట్‌ఫ్లైట్ ప్లాట్‌ఫామ్ ద్వారా పరిమిత సంఖ్యలో ఐవోఎస్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉన్నది.