మంగళూరు: కర్ణాటకలోని మంగళూరు సమీపంలో ఈ నెల 27న జరిగిన ఓ క్రికెట్ మ్యాచ్లో ఓ వ్యక్తి పాకిస్థాన్ జిందాబాద్ అని నినదించినందుకు అతడిని కొందరు చావబాదారు. బాధితుడు తీవ్ర గాయాలతో దవాఖానలో మృతి చెందాడు. మంగళవారం పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. కుడుపు గ్రామంలోని ఓ గుడి వద్ద ఈ ఘటన జరిగింది. మృతుడి వివరాలు వెల్లడి కాలేదు.
‘స్థానిక క్రికెట్ మ్యాచ్లో ఈ దుర్ఘటన జరిగింది. 12 మంది నిందితులను అదుపులోని తీసుకున్నాం. కేసు దర్యాప్తులో ఉంది. ప్రజలు శాంతి సామరస్యాలు పాటించాలని విజ్ఞప్తి చేస్తున్నా’ అని కర్ణాటక హోం మంత్రి పరమేశ్వర అన్నారు. కట్టెలతో తీవ్రంగా కొట్టడంతో అంతర్గతంగా రక్త స్రావం జరగడం, సమయానికి వైద్యం అందకపోవడం వల్ల బాధితుడు మృతి చెందినట్టు శవ పరీక్ష నివేదిక వెల్లడించింది.