Murder : ఒక చిన్న గొడవ హత్య చేసే వరకూ వెళ్లింది. మద్యం స్టఫ్ విషయంలో వాగ్వాదానికి దిగిన ఓ వ్యక్తి బార్ ఉద్యోగిని పొడిచి చంపేశాడు. కేరళలో ఆదివారం జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. త్రిస్సూర్ జిల్లాలోని ఎరుమపెట్టి పట్టణం, నెల్లువాయికి చెందిన హేమచంద్రన్ (62) బార్ ఉద్యోగిగా పనిచేస్తున్నారు.
అంబల్లూర్లోని అలక్కపనగర్కు చెందిన సిజో అనే వ్యక్తి బార్‌కు మద్యం సేవించడానికి వెళ్లాడు. అయితే టూనా ఫిష్ పికిల్ కోసం బార్ సిబ్బందితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో హేమచంద్రన్‌కు, సిజోకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దీంతో సిజోను బార్ నుంచి బయటకు తోసేశారు హేమచంద్రన్. ఈ నేపథ్యంలో పగ పెంచుకున్న సిజో బార్ మూసివేసే వరకూ అక్కడే వేచి ఉన్నాడు. ఆదివారం రాత్రి 11: 30 గంటల సమయంలో హేమచంద్రన్ బయటకి టీ తాగడానికి వెళ్లి వస్తుండగా ఒక్కసారిగా అతడిపై దాడి చేశాడు.
తన వెంట తెచ్చుకున్న కత్తితో హేమచంద్రన్ మెడపై పొడిచి అక్కడి నుంచి పారిపోయాడు. తీవ్ర గాయాలతో ఉన్న అతన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారు. కానీ అతను అప్పటికే చనిపోయినట్లు వైద్యులు ధృవీకరించారు. ఇదంతా అక్కడే ఉన్న సీసీ కెమరాలో రికార్డయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడిని అరెస్ట్ చేశారు.