న్యూఢిల్లీ, ఏప్రిల్ 24: జమ్ముకశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన అమానుష దాడిని యావత్ ప్రపంచం ఖండిస్తున్న వేళ న్యూఢిల్లీలోని పాకిస్థాన్ హై కమిషన్‌లోకి ఓ వ్యక్తి కేక్ బాక్సు పట్టుకుని వెళ్లడం చర్చనీయాంశమైంది. ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. హై కమిషన్ వెలుపల ఉన్న జర్నలిస్టుల ప్రశ్నలకు జవాబివ్వకుండా కేక్ బాక్సుతో ఆ వ్యక్తి లోపలకు వెళ్లిపోయాడు.
25 మంది భారతీయులు, ఓ నేపాల్ జాతీయుడిని బలిగొన్న పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా దేశం యావత్తు విషాదంలో మునిగి ఉండగా పాక్ హై కమిషన్‌లోకి కేక్ వెళ్లడంపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. పాక్ హై కమిషన్ వెలుపల పాకిస్థాన్ ముర్దాబాద్ అంటూ నిరసనకారులు నినాదాలు చేస్తున్న సమయంలో ఈ వీడియో ప్రత్యక్షమైంది. పాక్ ఎంబసీలో ఏవైనా వేడుకలు జరుగుతున్నాయా అని ఓ నెటిజన్ ఆగ్రహంతో ప్రశ్నించగా, ఎవరిదో పుట్టినరోజు అయి ఉండవచ్చని మరో నెటిజన్ ఈ వీడియోను తేలికగా తీసిపారేశాడు.