న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలో ఉన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఘోర పరాజయంపై పంజాబ్‌కు చెందిన కాంగ్రెస్ నేత ప్రతాప్ సింగ్ బజ్వా స్పందించారు. పంజాబ్‌లో అధికారంలో ఉన్న ఆప్ సీఎం భగవంత్ మాన్ (Bhagwant Mann) రాజకీయ భవిష్యత్తుపై దీని ప్రభావం ఉంటుందని తెలిపారు. ‘భగవంత్ మాన్ ఇప్పటికే కేంద్ర హోంమంత్రి శాఖతో (అమిత్ షాతో) టచ్‌లో ఉన్నారు. దీంతో ఆయన బీజేపీలోకి చేరవచ్చు. పంజాబ్‌లోని ఆప్‌లో చీలిక వచ్చే అవకాశం ఉంది’ అని అంచనా వేశారు.
కాగా, మహారాష్ట్రకు చెందిన ఏక్నాథ్ షిండే తరహా మార్గాన్ని భగవంత్ మాన్ అనుసరిస్తారని ప్రతాప్ సింగ్ బజ్వా తెలిపారు. ‘ఈ మహారాష్ట్ర విమానం చండీగఢ్‌లో ల్యాండ్ అయినప్పుడల్లా, ఏక్నాథ్ షిండేగా మారే మొదటి ప్రయాణికుడు భగవంత్ మాన్ అవుతారు’ అని బజ్వా అన్నారు. అలాగే ఆప్ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, భగవంత్ మాన్ మధ్య విభేదాలు పెరుగుతున్నాయని చెప్పారు.
మరోవైపు ఢిల్లీలో మాదిరిగానే పంజాబ్ ప్రజలు కూడా మార్పును కోరుకుంటున్నారని ప్రతాప్ సింగ్ బజ్వా తెలిపారు. ‘వారి (ఆప్) తప్పుడు వాగ్దానాలు, ఆ రకమైన అన్ని విషయాలతో పంజాబ్ ప్రజలు ఆకర్షితులయ్యారు. నేడు ప్రతిదీ శిథిలావస్థలో ఉంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు అస్తవ్యస్తంగా ఉన్నాయి. ఎవరి ప్రాణాలకు భద్రత లేదు. ఎవరి ఆస్తికీ భద్రత లేదు. ఢిల్లీ ప్రజలు చేసినట్లుగానే ఈ ప్రభుత్వాన్ని కూడా అంతం చేయాలని పంజాబ్ ప్రజలు కోరుకుంటున్నారు’ అని అన్నారు.