జాయ్నగర్ (పశ్చిమబెంగాల్), నవంబర్ 13: పశ్చిమబెంగాల్లో అధికార తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)కు చెందిన నాయకుడు దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన సోమవారం దక్షిణ 24 పరగణాల జిల్లాలో చోటుచేసుకున్నది. జాయ్నగర్ పరిధిలోని బామున్గాచ్ఛి ప్రాంత అధ్యక్షుడు సైఫొద్దీన్ లష్కర్ ప్రార్థనల కోసం ఇంటి నుంచి బయటికి వచ్చాడు.
ఇదే అదునుగా భావించిన కొందరు దుండగులు చాలా దగ్గర నుంచి కాల్చి చంపారు. సైఫొద్దీన్ మద్దతుదారులు కాల్పులకు తెగబడ్డ వారిలో ఇద్దరిని పట్టుకొని ఒకడిని కొట్టి చంపారు. అప్పటికే అక్కడికి చేరుకొన్న పోలీసులు మరొకడిని కాపాడి అరెస్టు చేశారు. కాల్పులకు సీపీఎం నాయకులే కారణమని టీఎంసీ నేతలు ఆరోపించారు.