న్యూఢిల్లీ, జనవరి 13: వీధి కుక్కల కేసులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సుప్రీంకోర్టు మంగళవారం తీవ్ర హెచ్చరికలు జారీచేసింది. ఏబీసీ నిబంధనలు అమలు చేయడంలో ఘోరంగా విఫలమైన పక్షంలో ప్రభుత్వ అధికారులపై భారీ జరిమానాలు విధిస్తామని సుప్రీంకోర్టు హెచ్చరించింది. ప్రతి కుక్క కాటుకూ, దాని వల్ల సంభవించే ప్రతి మరణానికి భారీ జరిమానాలు చెల్లించాల్సి వస్తుందని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను న్యాయస్థానం హెచ్చరించింది.
కుక్క కుటు ప్రభావం జీవితాంతం ఉంటుందని, ఈ దాడులకు వీధి కుక్కల పోషకులను బాధ్యుల్ని చేయాలని కూడా కోర్టు పేర్కొంది. వీధి కుక్కల కేసుపై విచారణ జరిపిన జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెహతా, జస్టిస్ ఎన్వీ అంజారియాలతో కూడిన ధర్మాసనం కుక్క కాట్లకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను బాధ్యుల్ని చేస్తామని ప్రకటించింది. ఈ కేసు విచారణ సుదీర్ఘంగా కొనసాగుతున్నదని ధర్మాసనం అసంతృప్తి వ్యక్తం చేసింది. 1950వ దశకం నుంచి పార్లమెంట్ పరిశీలనలో ఈ అంశం ఉన్నట్లు ప్రభుత్వమే చెబుతున్నదని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అలసత్వం వల్ల ఈ సమస్య 1000 రెట్లు పెరిగిందని ధర్మాసనం తెలిపింది. ఈ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని న్యాయస్థానం ఆక్షేపించింది.
అంతగా ప్రేమిస్తే వాటిని మీ ఇంట్లో పెట్టుకోండి
కుక్క కాటు వల్ల ప్రాణాలు కోల్పోయిన ప్రతి పురుషుడు, మహిళకు ప్రభుత్వాన్ని బాధ్యురాలిని చేసి భారీ నష్టపరిహారం విధిస్తామని ధర్మాసనం హెచ్చరించింది. వీధి కుక్కలకు ఆహారం పెడుతున్న జంతుప్రేమికులపై కూడా ధర్మాసనం ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘మిమ్మల్ని కూడా బాధ్యుల్ని చేస్తాం. అంతగా ప్రేమిస్తే వాటిని మీ ఇంట్లో పెట్టుకోండి. వాటిని ఎందుకు బయట వదలి ప్రజలను కరవడానికి, వెంటపడడానికి అనుమతిస్తున్నారు? కుక్క కాటు ప్రభావం జీవితాంతం వెంటాడుతుంది’ అని ధర్మాసనం వ్యాఖ్యానించింది.
గత వారం మూడుసార్లు సుదీర్ఘ విచారణ తర్వాత మళ్లీ ఈ వారం ఈ వివాదాస్పద అంశం విచారణకు వచ్చింది. అన్ని వీధికుక్కలను తరలించాలని తాము చెప్పడం లేదని, నిబంధనలను సక్రమంగా అమలు చేయాలని మాత్రమే తాము కోరుతున్నామని గతవారం ధర్మాసనం స్పష్టం చేసింది. చట్ట నిబంధనలు సక్రమంగా అమలు జరిగేందుకు అనుమతించాలని మాత్రమే కోరుతున్నామని నేటి విచారణలో ఇరుపక్షాల న్యాయవాదులకు ధర్మాసనం స్పష్టం చేసింది.
వీధి బాలలపై ఆ జాలి ఏదీ?
విచారణ సందర్భంగా గుజరాత్ హైకోర్టులో కుక్కకాటుకు గురైన ఓ న్యాయవాది కేసును కోర్టు ప్రస్తావించింది. గుజరాత్లో ఓ న్యాయవాదిని కుక్క కరిచిన తర్వాత వీధి కుక్కలను పట్టుకోవడానికి మున్సిపల్ కార్పొరేషన్ సిబ్బంది అక్కడకు వెళ్లారు. అయితే ఇదే శునక ప్రేమికులమని చెప్పుకునే న్యాయవాదులే మున్సిపల్ సిబ్బందిని తరిమికొట్టారని ధర్మాసనం తెలిపింది. జంతు సంరక్షణశాలలు, జంతు హక్కుల రక్షణ సంఘాలు, జంతు ప్రేమికుల తరఫున న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ వీధి కుక్కలకు శాశ్వత ఆశ్రయం కల్పించేందుకు అవసరమైన నిధులు మున్సిపల్ అధికారుల వద్ద లేవని తెలిపారు.
అన్ని జీవులను దయతో, ప్రేమతో చూడాలని, వీధి కుక్కలను తొలగించినంత మాత్రాన ఈ బెడద శాశ్వతంగా తీరిపోదని వారు చెప్పారు. వీధి కుక్కలను దత్తత తీసుకునే వారికి రాయితీలు కల్పిస్తూ ఓ జాతీయ విధానాన్ని రూపొందించాలని ఓ న్యాయవాది సూచించారు. దీనిపై జస్టిస్ సందీప్ మెహతా మండిపడుతూ వీధిబాలలను దత్తత తీసుకునే విషయంలో ఎందుకు ఆ జాలి, కరుణ రావడం లేదని ప్రశ్నించారు. కేసు విచారణ జనవరి 20కి వాయిదాపడింది.