ముంబై, ఫిబ్రవరి 4 (నమస్తే తెలంగాణ): ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్ వేపై ఒక గ్యాస్ ట్యాంకర్ బోల్తా పడటంతో భారీగా ట్రాఫిక్ జామైంది. వేలాది వాహనాలు సుమారు 20 కి.మీ మేర నిలిచిపోయాయి. వందలాది మంది హైవేపై చిక్కుకుపోయారు. మహిళలు, పిల్లలు, ఇతరులు రాత్రంతా ఆహారం, నీరు లేక అలమటించారు. 30 గంటలు గడిచినా ట్రాఫిక్ ఇంకా క్లియర్ కాలేదు. అసిటిలైన్ గ్యాస్‌తో వెళ్తున్న ఒక గ్యాస్ ట్యాంకర్ ఖండాలా కొండ ప్రాంత ఘాట్ సెక్షన్లో మంగళవారం సాయంత్రం బోల్తాపడింది.
దీంతో రెండు వైపులా భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. మండే లక్షణం గల అసిటిలైన్ గ్యాస్ బోల్తాపడిన ట్యాంకర్ నుంచి ఇంకా లీకవుతుండటంతో అక్కడికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, భారత పెట్రోలియం టీములు చేరుకుని పరిస్థితిని సమీక్షిస్తున్నాయి. మరొక గ్యాస్ ట్యాంకర్‌ను రప్పించి బోల్తాపడిన ట్యాంకర్‌లోని గ్యాస్‌ను దానిలోకి ఎక్కించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇది మలుపులు తిరిగి ఉన్న రోడ్డు కావడంతో డ్రైవర్ ట్యాంకర్‌ను నియంత్రించ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని హైవేస్ పోలీస్ సూపరింటెండెంట్ తానాజీ చిఖలే చెప్పారు.