బెంగళూరు: పుట్టిన బిడ్డకు పేరు విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. (Fight Over Naming Baby) భార్య ప్రతిపాదించిన పేరు నచ్చని భర్త, బిడ్డ నామకరణ కార్యక్రమానికి వెళ్లలేదు. వారిద్దరి మధ్య విభేదాలు ముదరడంతో విడాకుల కోసం కోర్టును ఆశ్రయించారు. చివరకు కోర్టు జోక్యంతో ఈ వివాదం ముగిసింది. విస్తూపోయే ఈ సంఘటన కర్ణాటక రాజధాని బెంగళూరులో జరిగింది. 2021లో ఒక జంటకు బాబు పుట్టాడు. అయితే 21 ఏళ్ల భార్య ప్రతిపాదించిన ‘ఆది’ పేరు 26 ఏళ్ల భర్తకు నచ్చలేదు. దీంతో భార్య పుట్టింట్లో జరిగిన బాబు నామకరణ కార్యక్రమానికి అతడు వెళ్లలేదు.
కాగా, బిడ్డ పేరు అంశంపై ఆ దంపతుల మధ్య వివాదం కొన్ని నెలలు కొనసాగింది. దీంతో విడాకులు, భరణం కోసం కోర్టును భార్య ఆశ్రయించింది. ఈ వివాదంపై విచారణ మూడేళ్లుగా కొనసాగింది. అయితే న్యాయమూర్తులు ఇచ్చిన పలు సూచనలను కూడా భార్యాభర్తలు తిరస్కరించారు.
మరోవైపు గత వారం మైసూరు సెషన్ కోర్టు ఈ వివాదంపై జోక్యం చేసుకున్నది. ఈ సమస్య పరిష్కారానికి జడ్జి చొరవచూపారు. తల్లిదండ్రులను కోర్టుకు పిలిపించి మాట్లాడారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మూడేళ్ల వయస్సున్న తమ కుమారుడికి ‘ఆర్యవర్ధన్’ అని పేరు పెట్టేందుకు ఆ జంట మధ్య స్నేహపూర్వకంగా ఒప్పందం కుదిరింది. దీంతో ఈ వివాదాన్ని పరిష్కరించుకున్న ఆ దంపతులు తమ బాబుతో కలిసి జీవిస్తున్నారు.