Drone shot down : భారత్ హెచ్చరికలు చేస్తున్నా పట్టించుకోకుండా సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) కవ్వింపులకు పాల్పడుతూనే ఉంది. సరిహద్దు ప్రాంతాల్లోని పౌరులపై కూడా పాక్ సైనికులు కాల్పులకు తెగబడుతున్నారు. తాజాగా శ్రీనగర్ (Srinagar) పై పాక్ డ్రోన్ దాడి (Drone attack) కి ప్రయత్నించింది. ఆ దాడిని ఇండియన్ ఆర్మీ (Indian Army) సమర్థంగా తిప్పికొట్టింది. శ్రీనగర్ పాత ఎయిర్‌ఫీల్డ్‌లో భారత ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ (Air defence system) పాక్ డ్రోన్‌ను కూల్చేసింది.
డ్రోన్‌ను కూల్చివేయడానికి ముందు కూడా శ్రీనగర్‌లో పేలుళ్ల శబ్దం వినిపించినట్లు అక్కడి ఆర్మీ అధికారులు తెలిపారు. శ్రీనగర్ విమానాశ్రయం సమీపంలో ఉదయం 11.45 గంటల ప్రాంతంలో రెండు భారీ పేలుళ్ల శబ్దాలు వినిపించాయని చెప్పారు. పేలుళ్ల కారణంగా ప్రజలు భయాందోళనకు గురయ్యారని, విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని అన్నారు. అయితే పేలుళ్ల శబ్దం వినపడగానే పలు ప్రాంతాల్లో సైరన్లు మోగించి ప్రజలను అప్రమత్తం చేశామని తెలిపారు.
అంతకుముందు అవంతిపురం సమీపంలో ఐదుసార్లు భారీ పేలుడు శబ్దాలు వినిపించినట్లు అధికారులు చెప్పారు. శ్రీనగర్‌లోని దాల్ సరస్సులో క్షిపణి లాంటి వస్తువు పడినట్లు గుర్తించామన్నారు. శనివారం తెల్లవారుజామున శ్రీనగర్ విమానాశ్రయంపై, ఎయిర్ బేస్‌పై డ్రోన్లతో దాడి చేయగా.. సైన్యం వాటిని తిప్పికొట్టింది. సరిహద్దు ప్రాంతాల్లో పాక్ వరుస దాడులకు పాల్పడుతుండడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ప్రజలు బహిరంగ ప్రదేశాల్లో, బాల్కనీల్లో ఉండకుండా ఇళ్లల్లోనే ఉండాలని హెచ్చరించారు. పంజాబ్‌లోని బఠిండాలో అధికారులు రెడ్ అలర్ట్ విధించారు. శ్రీనగర్ ఎయిర్పోర్ట్ సమీపంలో పేలుళ్లు సంభవిస్తుండడంతో దానితో సహా ఉత్తర, పశ్చిమ భారత్‌లోని 32 విమానాశ్రయాలను ఈ నెల 15 వరకు మూసివేస్తూ కేంద్రం ఆదేశాలు జారీచేసింది.