Mohanlal Puja : కేరళ (Kerala) కు చెందిన ప్రముఖ నటుడు మమ్ముట్టి (Mammootty) ఆరోగ్యంగా ఉండాలని కాంక్షిస్తూ మరో అగ్ర నటుడు మోహన్‌లాల్ (Mohanlal) శబరిమల (Sabarimala) అయ్యప్ప ఆలయం (Ayyappa temple) లో ప్రత్యేక పూజలు చేశారు. దీనిపై ఇంటర్నెట్లో భిన్న స్పందనలు వస్తున్నాయి. మమ్ముట్టి కోసం మోహన్‌లాల్ శబరిమలలో పూజ చేయించి మతసామరస్యం కోసం పాటుపడ్డారని ఒక వర్గం వారు ప్రశంసలు కురిపిస్తున్నారు.
కానీ మరో వర్గం వారు మాత్రం దీనిపై తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. మమ్ముట్టి ఇస్లాం మతానికి చెందిన వ్యక్తి అని, ఇస్లాం మతస్తులు కేవలం అల్లాను మ్రాతమే ప్రార్థించాలని, తన పేరిట పూజ చేయించాలని మోహన్‌లాల్‌ను మమ్ముట్టి కోరి ఉంటే వెంటనే ఆ పూజ చేయించినందుకు తక్షణమే క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై మోహన్‌లాల్ స్పందిస్తూ పూజ అనేది తన వ్యక్తిగత విషయమని, ఈ విషయంలో ఇతరుల జోక్యం అనవసరమని వ్యాఖ్యానించారు.
మమ్ముట్టి ఇటీవల స్వల్ప అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో ఇటీవల తన సినిమా ప్రమోషన్ కోసం శబరిమలకు వెళ్లిన మోహన్‌లాల్.. ఈ నెల 18న మమ్ముట్టి జన్మనామం, జన్మ నక్షత్రం పేరుతో అక్కడ పూజ చేయించారు. అయితే ఈ పూజకు సంబంధించిన రషీదు తాజాగా బయటపడింది. అది ఇంటర్నెట్లో చక్కెర్లు కొడుతోంది. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచిన విధంగా వారు స్పందిస్తున్నారు.