Road accident : ముంబై-అహ్మదాబాద్ (Mumbai-Ahmedabad) జాతీయ రహదారిపై మరోసారి ఘోర ప్రమాదం జరిగింది. హదర్లా అసున్ ధనివారి ప్రాంతంలో యాత్రికుల (Tourists) తో వెళ్తున్న ఓ ట్రక్కు (Truck).. పశువుల లోడుతో వెళ్తున్న మరో ట్రక్కును బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 12 మంది దుర్మరణం పాలయ్యారు. మరో 25 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.
పోలీసులు, అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రమాదానికి గురైన ట్రక్కులో 100 మందికిపైగా యాత్రికులు ప్రయాణిస్తున్నారు. సుమారు సోమవారం సాయంత్రం 4 గంటల సమయంలో ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం ఎంత తీవ్రంగా ఉందంటే ట్రక్కులో చాలామంది వలస కార్మికులు చిక్కుకుపోయారు. సహాయక బృందాలు శ్రమించి మృతదేహాలను, క్షతగాత్రులను వెలికితీశాయి. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించి, క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆస్పత్రులకు తరలించారు. కాగా ఈ ప్రమాదం స్థానికులను భయాందోళనకు గురిచేసింది.
ఈ ప్రమాదం కారణంగా ముంబై-అహ్మదాబాద్ రహదారిపై కొంతసేపు ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. పోలీసులు సంఘటనా స్థలంలో పంచనామా నిర్వహించి, ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. ప్రాథమిక అంచనాల ప్రకారం.. వాహనాల వేగం, నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగింది. ముంబై-అహ్మదాబాద్ జాతీయ రహదారిపై తరచుగా జరుగుతున్న ఘోర ప్రమాదాల కారణంగా.. రహదారి భద్రతపై స్థానికుల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రమాదాల నివారణకు అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.