Madhya Pradesh | ఉజ్జయిని: మధ్యప్రదేశ్‌లో దారుణం చోటుచేసుకొన్నది. 12 ఏండ్ల బాలికపై లైంగిక దాడి జరిగింది. బాధిత బాలిక అర్ధనగ్నంగా, తీవ్రమైన రక్తస్రావంతో సాయం కోసం ఉజ్జయిని పట్టణ వీధుల్లో ఇంటింటికీ తిరిగినా, స్థానికులు పట్టించుకున్న పాపాన పోలేదు. పైగా చీత్కారం ఆమెకు ఎదురవడం సభ్యసమాజాన్ని తలదించుకునేలా చేసింది. దీనికి సంబంధించిన దృశ్యాలు బుధవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. సోమవారం బాలికపై లైంగిక దాడి జరిగినట్టు తెలుస్తున్నది.
లైంగిక దాడి అనంతరం అర్ధనగ్నంగా, ప్రైవేటు భాగాల నుంచి తీవ్ర రక్తస్రావంతో బాధిత బాలిక దాదాపు 2 గంటల పాటు ఇంటింటికీ వెళ్లి సాయం చేయాలని అర్థించింది. అయితే స్థానికులు స్పందించలేదు. చివరకు ఓ ఆశ్రమం వద్దకు బాలిక చేరుకోగా, ఆమె లైంగిక దాడికి గురైనట్టు ఓ సాధువు గుర్తించి, జిల్లా దవాఖానకు తరలించారు. బాలిక లైంగిక దాడికి గురైనట్టు వైద్యులు ధ్రువీకరించారు.
పరిస్థితి విషమంగా ఉండడంతో ఇండోర్ ప్రభుత్వ దవాఖానకు తరలించారు. బాధితురాలి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని వైద్యులు వెల్లడించారు. బాధితురాలు ఎక్కడ లైంగిక దాడికి గురైందనే దానిపై స్పష్టత లేదు. సోమవారం ఉజ్జయినిలోని మహాకల్ పోలీసుస్టేషన్ ఏరియాలో బాలిక రక్తపు మడుగులో కనిపించిందని ఉజ్జయిని ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు. బాధిత బాలిక యూపీకి చెందిన ప్రయాగ్‌రాజ్ నుంచి వచ్చినట్టుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. కాగా, బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితులను గుర్తించేందుకు సిట్‌ను ఏర్పాటు చేసినట్టు ఎస్పీ సచిన్ శర్మ తెలిపారు.
బీజేపీ పాలనలో నేరస్తులకు స్వేచ్ఛ
బీజేపీ పాలనలో రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ప్రతిపక్షాలు విమర్శించాయి. నేరస్తులు స్వేచ్ఛగా రోడ్లపై తిరుగుతున్నారని కాంగ్రెస్ నేత కమల్‌నాథ్ అన్నారు. మధ్యప్రదేశ్‌లోని ఆడబిడ్డల పరిస్థితి మొత్తం దేశానికి సిగ్గుచేటని రాహుల్ గాంధీ విమర్శించారు. దేశంలో మహిళలు, బాలికలకు వ్యతిరేకంగా నేరాలు పెరిగిపోతున్నాయని టీఎంసీ ఎత్తిచూపింది.