న్యూఢిల్లీ, అక్టోబర్ 15: ఈ ఏడాదిలాగే వచ్చే ఏడాదీ దేశంలోని ఉద్యోగుల జీతాలు 9.5 శాతం పెరుగవచ్చని డబ్ల్యూటీడబ్ల్యూ తాజా సాలరీ బడ్జెట్ ప్లానింగ్ నివేదిక చెప్తున్నది. మంగళవారం విడుదలైన ఈ రిపోర్టులో ఇతర ఆసియా దేశాలతో పోల్చితే భారత్లోనే 2025లో కార్పొరేట్ కంపెనీల ఉద్యోగుల వేతనాలు ఎక్కువగా పెరిగే అవకాశాలున్నట్టు డబ్ల్యూటీడబ్ల్యూ పేర్కొన్నది. వియత్నాం 7.6 శాతం, ఇండోనేషియా 6.5 శాతం, ఫిలిప్పీన్స్ 5.6 శాతం, చైనా, థాయిలాండ్లలో 5 శాతం చొప్పున ఉద్యోగుల జీతాలు పెరుగవచ్చన్నది. ఈ ఏడాది ఏప్రిల్-జూన్ మధ్య ప్రపంచవ్యాప్తంగా 168 దేశాల్లో జరిగిన ఈ సర్వేలో దాదాపు 32వేల కంపెనీలు తమ అభిప్రాయాలను పంచుకున్నాయి. భారత్ నుంచి 709 సంస్థలు పాల్గొన్నాయి. ఈ సందర్భంగా తమ ఉద్యోగులకు ఈ ఏడాది 9.5 శాతం జీతాలు పెంచామని, వచ్చే ఏడాది కూడా ఇదే స్థాయిలో హైక్ ఇస్తామని ప్రకటించాయి.