కోజికోడ్: కేరళలో మెదడు వాపు వ్యాధితో (Brain Infection) మరో చిన్నారి మృతిచెందింది. ఇటీవల బ్రేయిన్ ఈటింగ్ అమీబా వల్ల రాష్ట్రంలో మరణాలు సంభవిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా కోజికోడ్ జిల్లాలో అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ (Amoebic Encephalitis) అనే అరుదైన మెదడు వాపు వ్యాధితో తొమ్మిదేండ్ల బాలిక మృతి చెందింది. కలుషిత నీటిలో నివసించే అమీబా వల్ల ఈ వ్యాధి సోకుతుందని వైద్య శాఖ అధికారులు తెలిపారు. ఈ నెల 13న తమరస్సేరీకి చెదిన బాలిక జ్వరం, తలనొప్పి వంటి లక్షణాలతో బాధపడుతుండటంతో ఆమె కుటుంబ సభ్యులు సమీపంలోని దవాఖానలో చేర్పించారు. అయితే పరిస్థితి విషమించడంతో మరుసటిరోజు కోజికోడ్‌లోని వైద్య కళాశాలకు తరలించారు. అయితే ఆమె అదేరోజు మరణించింది.
మైక్రోబయాలజీ పరీక్షల్లో అమీబిక్ ఎన్‌కెఫలిటిస్ వ్యాధి కారణమని వైద్యులు నిర్ధారించారు. ఇలాటివి కోజికోడ్ జిల్లాలో ఇప్పటికే నాలుగు కేసులు నమోదయ్యాయని వెల్లడించారు. ఈ వ్యాధి సోకడానికి కారణమైన అమీబా గురించి అన్వేషించడానికి బాలిక ఇంటి పరిసరాల్లోని నీటి కాలువలు, చెరువులను పరిశీలిస్తున్నారు. ఒకసారి దానిని గుర్తించిన తర్వాత ఈ మధ్య కాలంలో ఇంకా ఎంతమంది అక్కడ స్నానం చేశారని ఆరా తీయాల్సి ఉంటుందని వెల్లడించారు.