అహ్మదాబాద్: గుజరాత్లో మరో చిన్నారికి హ్యూమన్ మెటాప్న్యూమో వైరస్ (హెచ్ఎంపీవీ) సోకింది. వైద్య పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో ఆ రాష్ట్రంలో హెచ్ఎంపీవీ (HMPV) వైరస్ కేసుల సంఖ్య నాలుగుకు పెరిగింది. జనవరి 6న అహ్మదాబాద్‌కు చెందిన తొమ్మిది నెలల బాబుకు జలుబు, దగ్గుతోపాటు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎదురైంది. దీంతో నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో ఆ చిన్నారిని అడ్మిట్ చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించగా హెచ్ఎంపీవీ వైరస్ సోకినట్లు శనివారం నిర్ధారణ అయ్యిందని అధికారులు తెలిపారు. ఆ చిన్నారి విదేశాల్లో ప్రయాణించలేదని అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పేర్కొంది.
కాగా, గుజరాత్లో వారం రోజుల్లో ఈ వైరస్ కేసుల సంఖ్య నాలుగుకు చేరిందని వైద్యాధికారులు తెలిపారు. జనవరి 10న సబర్కాంత జిల్లాకు చెందిన ఎనిమిదేళ్ల బాలుడికి హెచ్‌ఎమ్‌పీవీ సోకిందని తెలిపారు. రాష్ట్రంలో మూడవ కేసుగా అధికారులు పేర్కొన్నారు. జనవరి 9న అహ్మదాబాద్‌లో 80 ఏళ్ల వృద్ధుడికి ఈ వైరల్ ఇన్ఫెక్షన్ పాజిటివ్‌గా తేలింది. ఆస్తమాతో బాధపడుతున్న ఆ రోగి ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
మరోవైపు జనవరి 6న గుజరాత్లో హెచ్‌ఎమ్‌పీవీ తొలి కేసు నమోదైంది. రాజస్థాన్‌కు చెందిన రెండు నెలల బాలుడు జ్వరం, ముక్కు దిబ్బడ, ముక్కు కారటం, దగ్గు వంటి లక్షణాలతో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యాడు. చికిత్స తర్వాత ఆ బాలుడ్ని డిశ్చార్జ్ చేశారు.