న్యూఢిల్లీ : సౌదీ అరేబియాలోని పశ్చిమ ప్రాంతమైన జిజాన్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో 9 మంది భారతీయులు మరణించారు. దీనిపై జెడ్డాలోని భారత కాన్సులేట్ సంతాపం ప్రకటించింది. బాధిత కుటుంబాలకు సంపూర్ణ సహకారాన్ని అందచేస్తామని బుధవారం ఓ ప్రకటనలో కాన్సులేట్ హామీ ఇచ్చింది. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరితంగా కోలుకోవాలని ఆకాంక్షించింది.
సమాచారం కోసం ఓ ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపింది. ప్రమాద ఘటనపై భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ విచారం వ్యక్తం చేశారు. జెడ్డాలోని కాన్సల్ జనరల్‌తో తాను మాట్లాడానని, బాధిత కుటుంబాలతో ఆయన సంప్రదింపులు జరుపుతూ సౌదీ అధికారులతో సమన్వయం చేస్తున్నారని జైశంకర్ తెలిపారు.