MGNREGS | న్యూఢిల్లీ, అక్టోబర్ 25: గ్రామీణ ప్రజల కడుపు నింపే ఉపాధి హామీ పథకానికి (ఎంజీఎన్ఆర్ఈజీఎస్) కేంద్రం తూట్లు పొడుస్తున్నది. పథకం నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులను తొలగిస్తున్నది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ మధ్య ఆరు నెలల్లోనే 84.8 లక్షల మంది కార్మికులను ఈ పథకం నుంచి తొలగించారని లిబ్టెక్ అనే సంస్థ పేర్కొన్నది. ఉపాధి హామీ పథకం తీరుతెన్నులను ఈ సంస్థ ఎప్పటికప్పుడు విశ్లేషిస్తున్నది.
గత ఆరు నెలల కాలంలో కొత్తగా 45.4 లక్షల మంది కార్మికులు చేరారని, అంటే మొత్తం కార్మికుల సంఖ్య 39.3 లక్షలు తగ్గిందని ఈ సంస్థ పేర్కొన్నది. ఎక్కువ మందిని తొలగించిన రాష్ర్టాల్లో మొదట తమిళనాడు(14.7 శాతం), ఆ తర్వాత ఛత్తీస్గఢ్(14.6 శాతం) ఉన్నాయి. కార్మికులను తొలగించడం కొన్నేండ్లుగా కొనసాగుతున్నదని, 2022-23, 2023-24 ఆర్థిక సంవత్సరాల్లో మొత్తం 8 కోట్ల మంది కార్మికులను తొలగించినట్టు లిబ్టెక్ పేర్కొన్నది.
ఉపాధి హామీ పథకంలో వ్యక్తిగత పని దినాలు తగ్గుతున్నాయని ఈ సంస్థ పేర్కొన్నది. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 16.6 శాతం వ్యక్తిగత పని దినాలు(ఒక్క ఆర్థిక సంవత్సరంలో ఒక కార్మికుడు పని చేసే రోజులు) తగ్గనున్నట్టు తెలిపింది. కాగా, ఆధార్ ఆధారిత చెల్లింపుల వ్యవస్థ(ఏబీపీఎస్)ను తప్పనిసరి చేయడం కార్మికులకు ఇబ్బందిగా మారింది.
ఇందుకోసం కార్మికుల జాబ్ కార్డుకు ఆధార్ లింక్ అవ్వాలి. ఆధార్, జాబ్ కార్డుపై పేరు సరిగ్గా పొంతన కుదరాలి. బ్యాంక్ అకౌంట్కు ఆధార్ లింక్ కావడంతో పాటు, ఎన్పీసీఐలో నమోదు కావాలి. వీటిల్లో ఏది లేకపోయినా కార్మికులుఏబీపీఎస్కు అనర్హులుగా మారుతున్నారని, మొత్తం కార్మికుల్లో 27.4 శాతం మంది అనర్హులుగా ఉన్నట్టు లిబ్టెక్ తెలిపింది.