Delimitation | లోక్‌సభ స్థానాల పునర్విభజనపై క్రమంగా ఓ స్పష్టత వస్తున్నది. బిల్లు పార్లమెంటు ముందుకు వచ్చిన నేపథ్యంలో.. డీలిమిటేషన్‌పై వెల్లువెత్తుతున్న అభ్యంతరాలపై కేంద్రం స్పష్టతనిచ్చేందుకు ప్రయత్నించింది.
పునర్విభజన పూర్తయితే ప్రస్తుతం ఉన్న 543 లోక్‌సభ స్థానాల సంఖ్య 816కు చేరుతుందని ప్రకటించింది. అయితే దక్షిణాదికి సీట్లసంఖ్యలో అన్యాయమేదీ జరుగబోదని ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌షా చెప్తున్నా.. బిల్లు చుట్టూ అల్లుకున్న అనుమానాలు, వెల్లువెత్తుతున్న అభ్యంతరాలు తొలగిపోలేదు. ప్రజాస్వామ్య వ్యవస్థపై బీజేపీ దాడిచేస్తున్నదని విపక్ష సభ్యులు విమర్శిస్తున్నారు. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, కేంద్రపాలిత ప్రాంతాల్లో సీట్ల పెంపు.. మూడు కీలక బిల్లులపై శుక్రవారం లోక్‌సభలో ఓటింగ్ జరుగనున్నది.
(స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): దేశంలో లోక్‌సభ సీట్ల పెంపునకు రంగం సిద్ధమైంది. నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లు, యూటీల్లో సీట్ల పెంపునకు సంబంధించిన మూడు కీలక బిల్లులను కేంద్రం గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ప్రస్తుతం 543గా ఉన్న లోక్‌సభ స్థానాలు డీలిమిటేషన్ తర్వాత 816కు చేరనున్నట్టు తెలిపింది. మొత్తం లోక్‌సభ సీట్లలో 272 స్థానాలను మహిళలకు కేటాయించనున్నట్టు వెల్లడించింది. నియోజకవర్గాల పునర్విభజన కారణంగా ఏ రాష్ట్రమూ నష్టపోదని ప్రధానమంత్రి మోదీ హామీనిచ్చారు. తమకు ఏ రాష్ట్రంపై వివక్ష లేదని పేర్కొన్నారు. 50 శాతం ఫార్ములా ఆధారంగా చేసే డీలిమిటేషన్‌తో దక్షిణాదికి లోక్‌సభలో ప్రాతినిధ్యం మరింతగా పెరుగనున్నట్టు కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలిపారు. ఈ మూడు కీలక బిల్లులపై శుక్రవారం సాయంత్రం 4 గంటలకు ఓటింగ్ నిర్వహించనున్నట్టు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగబోతున్నదని ప్రతిపక్ష ఎంపీలు లోక్‌సభ ప్రారంభంలోనే నిరసనలకు దిగారు. మూడు బిల్లులను లోక్‌సభలో ప్రవేశపెట్టే కంటే ముందు డివిజన్ ఆఫ్ ఓటును నిర్వహించాలని స్పీకర్ ఓం బిర్లాకు విజ్ఞప్తి చేశారు. విపక్షాల కోరిక మేరకు ఓటింగ్ నిర్వహించగా.. బిల్లుల ప్రవేశానికి అనుకూలంగా 251 మంది ఓటేయగా, వ్యతిరేకిస్తూ.. 185 మంది సభ్యులు ఓటేశారు. దీంతో 131 రాజ్యాంగ సవరణ బిల్లు, డీలిమిటేషన్ బిల్లు, యూటీ సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. అనంతరం బిల్లులపై వాడీవేడి చర్చ సాగింది.
డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ర్టాలకు అన్యాయం జరుగుతుందన్న ప్రతిపక్షాల వాదనలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా తోసిపుచ్చారు. 50 శాతం ఫార్ములాతో దక్షిణాది జనాభా శాతం కంటే ఎక్కువ సీట్లు పెరుగుతాయని పేర్కొన్నారు. విపక్షాలు అవాస్తవాలు చెబుతూ ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్నాయని విమర్శించారు. ప్రస్తుతం లోక్‌సభలో ఐదు దక్షిణాది రాష్ర్టాలకు 129 సీట్లు ఉన్నాయన్న షా.. డీలిమిటేషన్ తర్వాత ఈ సంఖ్య 195కు చేరుతుందని తెలిపారు. దీంతోపాటు లోక్‌సభలో దక్షిణాది రాష్ర్టాల ప్రాతినిధ్యం ఇప్పుడున్న 23.76 శాతం నుంచి 23.89 శాతానికి పెరుగుతుందని పేర్కొన్నారు. లోక్‌సభలో ప్రస్తుతం తెలంగాణకు 17 స్థానాలు ఉండగా, పెరిగిన తర్వాత సీట్ల సంఖ్య 26కు చేరుతుందన్నారు. అంటే లోక్‌సభలో 3.13 శాతంగా ఉన్న తెలంగాణ ప్రాతినిధ్యం.. డీలిమిటేషన్ తర్వాత 3.18 శాతానికి పెరుగుతుందని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం లోక్‌సభ స్థానాలు 25 ఉండగా, డీలిమిటేషన్ తర్వాత 38కు చేరుతాయని తెలిపారు. ఇదేవిధంగా కర్ణాటక సీట్లు 28 నుంచి 42కు, తమిళనాడు సీట్లు 39 నుంచి 59కు, కేరళ సీట్లు 20 నుంచి 30కి పెరుగుతాయని వివరించారు.
మహిళా రిజర్వేషన్లతో ముడిపడిన నియోజకవర్గాల పునర్విభజన బిల్లుపై గురువారం లోక్‌సభలో జరిగిన చర్చ సందర్భంగా ముస్లిం మహిళలకు రిజర్వేషన్ల విషయంలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేశ్ యాదవ్, కేంద్ర హోం మంత్రి అమిత్ షా మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ముస్లిం మహిళలకు విడిగా రిజర్వేషన్లు దక్కాలని అఖిలేశ్ డిమాండ్ చేశారు. తమ పార్టీ కుల గణనను కోరుకుంటున్నదని ఆయన చెప్పారు. దీనికి అమిత్ షా స్పందిస్తూ జనగణన ప్రక్రియ ఇదివరకే ప్రారంభమైందని చెప్పారు. ప్రస్తుతం ఇండ్ల గణన జరుగుతున్నదని, జన గణన జరిగినపుడు అందులో కులానికి సంబంధించిన ప్రస్తావన చేర్చుతామని అమిత్ షా చెప్పారు. మత ఆధారిత రిజర్వేషన్ల ఆలోచనను ఆయన తిరస్కరించారు. మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడం ఆమోదయోగ్యం కాదని, మతపరమైన కారణాలతో ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం రాజ్యాంగ విరుద్ధమని అమిత్ షా అన్నారు. సమాజ్‌వాదీ పార్టీపై పరోక్షంగా విమర్శలు గుప్పిస్తూ తన పార్టీ టికెట్లన్నీ అఖిలేశ్ యాదవ్ ముస్లిం మహిళలకే ఇవ్వవచ్చని, అలాంటప్పుడు ఆయన పార్టీకి సమస్య ఎక్కడ ఉందని షా ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు వల్ల ఏ వ్యక్తి గానీ ఏ రాష్ట్రం గానీ ప్రతికూలంగా ప్రభావితం కాబోదని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ గురువారం లోక్‌సభకు తెలియజేశారు. మహిళలకు వారి హక్కులను కల్పించడమే ఈ బిల్లు ప్రధాన లక్ష్యమని మేఘ్వాల్ అన్నారు. మూడింట ఒక వంతు కోటాను ఏకరీతిగా అమలు చేసేందుకు లోక్‌సభను విస్తరించడంపైనే ఈ ప్రణాళిక ఆధారపడి ఉందని మంత్రి అన్నారు. దీనితో సభ బలం 50 శాతం పెరిగి 815 సీట్లకు చేరుతుందని, వాటిలో 272 సీట్లు మహిళలకు రిజర్వ్ అవుతాయని ఆయన చెప్పారు.
షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల మహిళలకు ఉప కోటాలను పార్లమెంట్, రాష్ట్ర శాసనసభలు దీని స్వరూపంలో పొందుపరుస్తాయని ఆయన వివరించారు. విపక్ష సభ్యులు డివిజన్ ఆఫ్ ఓటింగ్ కోసం డిమాండు చేయడంతో 40 నిమిషాల పాటు వాదోపవాదాలతో కూడిన చర్చ అనంతరం లోక్‌సభ గురువారం రాజ్యాంగ(131వ సవరణ) బిల్లు, 2026, కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల(సవరణ) బిల్లు, 2026, డీలిమిటేషన్ బిల్లు, 2026ను చర్చ, ఆమోదం కోసం చేపట్టింది.
ఎన్నికల కమిషన్(ఈసీ), న్యాయవ్యవస్థ వంటి సంస్థలపై ఒత్తిడి తేవడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడం ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు రాజ్యాంగ సవరణ బిల్లుతో ప్రజాస్వామ్యంపై బహిరంగ దాడి ప్రారంభించిందని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. గురువారం మూడు బిల్లులపై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొంటూ లోక్‌సభలో ప్రస్తుతమున్న 543 సీట్లలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లను ప్రభుత్వం ఎందుకు ఇవ్వలేదని ఆమె ప్రశ్నించారు. 2011 జనాభా లెక్కల డాటా ఆధారంగా డీలిమిటేషన్ కమిషన్ ద్వారా లోక్‌సభ సీట్ల సంఖ్యను 850 వరకు పెంచేందుకు ఈ బిల్లులో ప్రస్తావన ఉందని ఆమె చెప్పారు. పైకి చూస్తే ఇది బాగానే ఉన్నట్లు అనిపిస్తుందని, కానీ జాగ్రత్తగా చదివితేనే అసలు అర్థం బయటపడుతుందని, ఇందులో రాజకీయ ఛాయలు కనిపిస్తున్నాయని ప్రియాంక అన్నారు. నిబంధనలను క్షుణ్ణంగా పరిశీలిస్తే డీలిమిటేషన్ కమిషన్‌లోని ముగ్గురు సభ్యులే రాష్ర్టాల భవితవ్యాన్ని, పార్లమెంట్లో వాటి ప్రాతినిధ్యాన్ని నిర్ణయిస్తారని తెలుస్తుందని ఆమె చెప్పారు. అమిత్ షాను ఉద్దేశిస్తూ ఒకవేళ చాణక్యుడు ఇప్పుడు జీవించి ఉంటే మీ రాజకీయ చతురతకు (రాజనీతి కుటిలత) ఆయన ఆశ్చర్యపోయి ఉండేవారు. ఈ మొత్తం ప్రణాళికను ఆయనే(షా) రూపొందించారు. ఇప్పుడు నవ్వుతున్నారు. ఆయన నాతో ఏకీభవిస్తున్నారు అని ప్రియాంక వ్యాఖ్యానించారు.

అధికార బీజేపీ నారీ(మహిళ)ని నారా(నినాదం)గా మార్చేసిందని అఖిలేశ్ యాదవ్ గురువారం విమర్శించారు. జన గణను జాప్యం చేసేందుకే బీజేపీ మహిళా రిజర్వేషన్ చట్టానికి సవరణలు తీసుకువస్తున్నదని ఆయన అన్నారు. లోక్‌సభలో జరిగిన చర్చలలో అఖిలేశ్ పాల్గొంటూ తమ పార్టీ మహిళలకు రిజర్వేషన్లను ఎల్లప్పుడూ బలపరించిందని చెప్పారు. ఆర్ఎస్ఎస్ను ఉద్దేశిస్తూ బీజేపీ మాతృసంస్థ అధినాయకత్వంలో ఎందరు మహిళలు ఉన్నారని ఆయన ప్రశ్నించారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు అధికారంలో ఉన్న 21 రాష్ర్టాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఎంతమంది మహిళా ముఖ్యమంత్రులు ఉన్నారని ఆయన ప్రశ్నించారు.
మహిళా రిజర్వేషన్‌ను డీలిమిటేషన్‌తో ముడిపెడుతూ లోక్‌సభ స్థానాల్ని పెంచడాన్ని కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ తప్పుబట్టారు. గురువారం కేంద్రం లోక్‌సభలో ప్రవేశపెట్టిన మహిళా రిజర్వేషన్ బిల్లుపై గొగోయ్ మాట్లాడుతూ, ప్రతిపాదిత మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రస్తుత లోక్‌సభ సీట్ల సంఖ్య 543కు వర్తింపజేయాలని, భవిష్యత్ డీలిమిటేషన్‌తో ముడిపెట్టవద్దని అన్నారు.
చట్టసభల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పించే మహిళా రిజర్వేషన్ చట్టం 2023, గురువారం నుంచి అమల్లోకి వచ్చింది. ఈ మేరకు కేంద్ర న్యాయ శాఖ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. 2029లో అమలు చేసేందుకు అదే చట్టాన్ని సవరించాలని పార్లమెంట్లో చర్చ జరుగుతున్న క్రమంలో, ఈ 2023 చట్టాన్ని ఏప్రిల్ 16 నుంచి అమలులోకి వచ్చేలా ఎందుకు నోటిఫై చేశారో అన్న విషయం తెలియరాలేదు.
ప్రస్తుతం ఇలా
డీలిమిటేషన్ తర్వాత



