రాయ్పూర్: ఛత్తీస్గఢ్ ప్రభుత్వం జనాభా నిష్పత్తికి అనుగుణంగా ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో రిజర్వేషన్లను 81 శాతానికి పెంచే యోచనలో ఉన్నది. డిసెంబర్ 1 నుంచి జరిగే అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదని టైమ్స్ ఆఫ్ ఇండియా నివేదించింది. ఛత్తీస్గఢ్ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని తొమ్మిదో షెడ్యూల్లో చేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయనున్నదని పేర్కొన్నది. రాష్ట్రంలో రిజర్వేషన్ల కోటాను 58 శాతానికి పెంచుతూ 2012లో ప్రభుత్వం ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్ర హైకోర్టు రద్దు చేసింది. ఈ నేపథ్యంలో రిజర్వేషన్ల అంశంపై ఏర్పడిన ప్రతిష్టంభనను పరిష్కరించేందుకు ప్రత్యేక అసెంబ్లీ సమావేశాన్ని నిర్వహిస్తున్నది. ఛత్తీస్గఢ్ జనాభా నిష్పత్తి కోటా ప్రణాళికను అనుసరిస్తే.. రాష్ట్రంలో రిజర్వేషన్లు 81 శాతానికి చేరే అవకాశం ఉన్నది. ఇది దేశంలోనే అత్యధికం అవుతుంది. భూపేశ్ బఘేల్ ప్రభుత్వం ఎస్టీలకు 32 శాతం, ఎస్సీలకు 12%, ఓబీసీలకు 27% రిజర్వేషన్లు కల్పించాలనే యోచనలో ఉన్నదని నివేదికలు చెబుతున్నాయి. ఈడబ్ల్యూఎస్ 10% కోటా కలుపుకొంటే రిజర్వేషన్లు 81 శాతానికి చేరుతాయి. జనాభా నిష్పత్తి అనుగుణంగా రిజర్వేషన్లు కల్పించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉన్నదని సీఎం బఘేల్ ఇప్పటికే ప్రకటించారు.