లక్నో: మెడికల్ కాలేజీకి చెందిన సీనియర్ విద్యార్థులు జూనియర్లను ర్యాగింగ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న కాలేజీ యాజమాన్యం చర్యలు చేపట్టింది. 8 మంది విద్యార్థులను ఆరు నెలలపాటు సస్పెండ్ చేసింది. (Students suspended for ragging) అలాగే రూ.10,000 చొప్పున జరిమానా విధించింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. గణేష్ శంకర్ విద్యార్థి మెమోరియల్ మెడికల్ కాలేజ్‌కు చెందిన జూనియర్లపై సీనియర్లు ర్యాగింగ్‌కు పాల్పడ్డారు. నకిలీ ఇన్స్టాగ్రామ్, ఇతర సోషల్ మీడియా పోస్టులు, కాల్స్ ద్వారా జూనియర్ విద్యార్థులను వేధించారు.
కాగా, సీనియర్ల ర్యాగింగ్‌పై ఫిర్యాదు అందుకున్న కాలేజీ యాజమాన్యం దర్యాప్తు చేపట్టింది. ప్రభుత్వానికి, ర్యాగింగ్ సెల్‌కు సమాచారం ఇచ్చారు. సీసీటీవీ ఫుటేజ్‌తోపాటు సాక్ష్యాల పరిశీలన ద్వారా ర్యాగింగ్ జరిగినట్లు నిర్ధారించారు. ఎనిమిది మంది సీనియర్ విద్యార్థులను గుర్తించారు.
మరోవైపు ర్యాగింగ్‌కు పాల్పడినట్లు ఆ స్టూడెంట్స్ అంగీకరించడంతోపాటు క్షమాపణలు చెప్పినట్లు మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ సంజయ్ కళా తెలిపారు. వారిని ఆరు నెలలపాటు కాలేజీ నుంచి సస్పెండ్ చేసినట్లు చెప్పారు. అలాగే ఒక్కొక్కరికి రూ.10,000 చొప్పున జరిమానా కూడా విధించినట్లు వెల్లడించారు.