న్యూఢిల్లీ, జనవరి 31: భారత ఆర్థిక వ్యవస్థ 2047కల్లా అభివృద్ధి చెందినదిగా అవతరించాలంటే కనీసం రెండు దశాబ్దాలపాటు 8 శాతం వృద్ధిరేటును సాధించాలని ముఖ్య ఆర్థిక సలహాదారు (సీఈఏ) వీ అనంత నాగేశ్వరన్ అన్నారు. శుక్రవారం 2024-25కుగాను ఆర్థిక సర్వే విడుదలైన నేపథ్యంలో ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. భారత ఆర్థిక వృద్ధిరేటు మందగమనం అంతర్జాతీయ పరిస్థితులు బాగాలేకపోవడం వల్లేనని చెప్పుకొచ్చారు.
ఈ క్రమంలోనే అంతర్జాతీయ అనుకూల పరిస్థితులను అందిపుచ్చుకుంటే వచ్చే 20 ఏండ్లకుపైగా కాలంలో అభివృద్ధి చెందిన దేశాల సరసన భారత్ కూడా ఉండగలదన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2025-26)గాను దేశ జీడీపీ 6.3-6.8 శాతం మధ్య ఉంటుందని ఆర్థిక సర్వేలో అంచనా వేయగా, దేశీయ ఎగుమతులు పుంజుకుంటే మరో అర శాతం లేదా ఒక శాతం వృద్ధిరేటు పెరిగేందుకు వీలుంటుందని చెప్పారు. ఇదే జరిగితే 7.5-8 శాతానికి జీడీపీ నమోదు కావచ్చన్నారు.
దేశీయ స్టాక్ మార్కెట్లు ఈసారి కరెక్షన్కు గురయ్యే అవకాశాలు మెండుగావున్నాయని ఆర్థిక సర్వే హెచ్చరిస్తున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న చర్యలతో అక్కడి మార్కెట్లు తీవ్ర ఆటుపోటులకు గురికావాల్సి వస్తున్నదని, ఈ ప్రభావం దేశీయ సూచీలపై తప్పనిసరిగా వుంటుందని సర్వే అభిప్రాయపడుతున్నది. మరోవైపు, కరోనా తర్వాత ఈక్విటీ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టే యువత సంఖ్య గణనీయంగా పెరిగారని తెలిపింది. 2019-20 ఆర్థిక సంవత్సరంలో 4.9 కోట్ల మంది ఉన్న ఈక్విటీ పెట్టుబడిదారులు డిసెంబర్ 31, 2024 నాటికి రెండున్నరెట్లు పెరిగి 13.2 కోట్లకు చేరుకున్నారు.
పెరుగుతున్న డిజిటలైజేషన్ భారతీయ ఆర్థిక రంగాన్ని ప్రభావవంతంగా మారుస్తున్నదని ఆర్థిక సర్వే పేర్కొన్నది. అయితే సైబర్ మోసాలూ అంతే స్థాయిలో పెరుగుతున్నాయని, దీనివల్ల అమాయకులు ఆర్థికంగా నష్టపోతున్నారని చెప్పింది. కాగా, ఓవైపు సైబర్ సెక్యూరిటీ వ్యవస్థను భారత్ బలోపేతం చేస్తున్నా, గ్లోబల్ సెక్యూరిటీ ఇండెక్స్‌లో ర్యాంక్ పెరుగుతున్నా.. సైబర్ దాడులు ఆగట్లేదని సర్వే పేర్కొనడం గమనార్హం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సైతం పెరుగుతున్న సైబర్ నేరాలపై ఆందోళన వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే.
దేశీయ తయారీ రంగం ఒత్తిడిలో ఉన్నట్టు ఆర్థిక సర్వే పేర్కొన్నది. మార్కెట్లో వినిమయ శక్తి పడిపోవడంతో సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థ (ఎంఎస్ఎంఈ)లన్నీ కుదేలైపోయిన విషయం తెలిసిందే. ఇందుకు ఆర్థిక సర్వే కూడా అద్దం పట్టింది. ధరల పెరుగుదలతో కొనుగోళ్లు అంతంతమాత్రంగానే సాగడం.. తయారీని దెబ్బతీసింది. ఇక తాజాగా కీలక రంగాల్లోనూ వృద్ధి పడకేసినట్టు తేలింది. డిసెంబర్ నెలకుగాను ఎనిమిదింటిలో నాలుగు రంగాలు డీలా పడినట్టు స్పష్టమైంది. బొగ్గు, సహజ వాయువు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువుల రంగాల్లో ఉత్పాదకత పడిపోయింది. కాగా, అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేమి.. భారతీయ ఉత్పాదక రంగంపై ప్రభావం చూపిస్తున్నట్టు ఆర్థిక సర్వే చెప్తున్నది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధి 6.3 శాతం నుంచి 6.8 శాతం మధ్యలో నమోదుకానున్నదని ఆర్థిక సర్వే అంచనావేస్తున్నది. రిజర్వుబ్యాంక్ అంచనావేసినదానికంటే తక్కువగా నమోదుకానున్నది. అలాగే మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో వృద్ధి నాలుగేండ్ల కనిష్ఠ స్థాయి 6.4 శాతానికి పడిపోనున్నదని అంచనా. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా పెట్టుకున్న మోదీ సర్కార్..ఈ లక్ష్యానికి చేరుకోవాలంటే ప్రతియేటా 8 శాతానికి పైగా వృద్ధిని సాధించాల్సి ఉంటుందని ఆర్థిక సర్వే విశ్లేషించింది. అలాగే జీడీపీలో పెట్టుబడుల రేటు 35 శాతానికి పెంచాల్సిన అవసరం ఉన్నదని వ్యాఖ్యానించింది.
ఎలక్ట్రిక్ వాహనాల వాడకాన్ని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం వీటిపై పన్ను ప్రోత్సాహకాలు కొనసాగించాలని ఆర్థిక సర్వే సూచించింది. కాలుష్య ఉద్గారాన్ని తగ్గించడానికి సర్కార్ పలు కీలక చర్యలు తీసుకుంటున్నప్పటికీ, వీటి వాడకాన్ని పెంపొందించడానికి ఆర్థిక రాయితీలతోపాటు ఇతర ప్రయోజనాలు కల్పించాలని సూచించింది. ఇదే సమయంలో చమురుపై ఎక్సైజ్ సుంకాలని పెంచాలని, మరోవైపు ఎలక్ట్రిక్ వాహనాలపై రాయితీలు ఇవ్వాలని సూచించింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ఆకట్టుకోవడంలో భారత్ వెనుకంజవేస్తున్నది. అంతర్జాతీయంగా అనిశ్చిత పరిస్థితులు నెలకొనడం, ద్రవ్యోల్బణ ఒత్తిడి కొనసాగుతుండటం, అభివృద్ధి చెందుతున్న దేశాలు వడ్డీరేట్లను పెంచుతుండటం, రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొంటుండటంతో విదేశీ సంస్థాగత పెట్టుబడిదారులు ఇక్కడ ఇన్వెస్ట్ చేయడానికి జంకుతున్నారు. ఎఫ్‌డీఐలను ఆకట్టుకోవడానికి చర్యలను వేగవంతం చేయాల్సిన అవసరం ఉన్నదని సర్వే అభిప్రాయపడింది. ఎఫ్‌డీఐలకు ఊతమివ్వడానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకోవాలని సూచించింది.