Karnataka | బెంగళూరు, జనవరి 10: కర్ణాటక అసెంబ్లీ ఎదుట బుధవారం ఒకే కుటుంబానికి చెందిన ఎనిమిది మంది ఆత్మహత్యాయత్నం చేశారు. ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకునేందుకు ప్రయత్నించగా, అక్కడే ఉన్న పోలీసులు వారిని అడ్డుకున్నారు. వారిని అదుపులోకి తీసుకొని అక్కడి నుంచి తరలించారు. రుణ బకాయి రికవరీ చేసేందుకు తమ ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేయడానికి సిద్ధమవడంతో మనస్తాపం చెందిన వీరంతా ఆత్మహత్యకు యత్నించారు.
2016లో బెంగళూరు సిటీ కో ఆపరేటివ్ బ్యాంకు నుంచి ఈ కుటుంబం రూ.50 లక్షలు అప్పుగా తీసుకున్నది. రూ.95 లక్షల వరకు తిరిగి చెల్లించింది. వడ్డీసహా ఇతరాలు ఇంకా చెల్లించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆ కుటుంబం ఉంటున్న ఇంటిని బ్యాంకు అధికారులు వేలం వేయనుండటంతో మనస్తాపానికి గురైన కుటుంబం ఆత్మహత్యకు యత్నించింది. మైనార్టీ కుటుంబం విధాన్ సౌధ ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.