కొత్తగూడెం ప్రగతి మైదాన్, ఫిబ్రవరి 1: ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో మరోసారి మావోయిస్టులు, భద్రతా దళాలకు మధ్య భీకర ఎన్కౌంటర్ జరిగింది. శనివారం జరిగిన ఈ పోరులో 8 మందికి పైగా మావోయిస్టులు మరణించినట్టు తెలుస్తున్నది. బీజాపూర్ జిల్లా గంగలూరు-కోర్చోలి అడవుల్లో మావోయిస్టులు సంచరిస్తున్నట్టు పోలీస్ అధికారులకు పక్కా సమాచారం అందింది. దీంతో శనివారం డీఆర్జీ, ఎస్టీఎఫ్, కోబ్రా 202, సీఆర్పీఎఫ్ 222 భద్రతా దళాలు సంయుక్తంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ క్రమంలో మావోయిస్టులు తారసపడటంతో ఇరువర్గాల మధ్య సుమారు రెండు గంటల వ్యవధిలో మూడుసార్లు కాల్పులు జరిగినట్టు సమాచారం.
కాల్పులు ముగిసిన తర్వాత భద్రతా దళాలు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకుని గాలించగా ఎనిమిది మంది మావోయిస్టుల మృతదేహాలతో పాటు భారీ ఎత్తున ఆయుధాలు, ఇతర సామాగ్రి లభించినట్టు బస్తర్ రేంజ్ ఐజీ సుందర్రాజ్ పాటిలింగం తెలిపారు. ఘటనా స్థలంలో లభించిన ఆధారాల ప్రకారం సుమారు 12 మంది మావోయిస్టులు మృతి చెందినట్టు పోలీసులు అంచనా వేస్తున్నారు. కాగా, మావోయిస్టులను తుదముట్టడించడమే లక్ష్యంగా భద్రతా బలగాలు చేపట్టిన ‘ఆపరేషన్ కగార్’తో ఛత్తీస్గఢ్ దండకారణ్యంలో యుద్ధమేఘాలు అలుముకున్నాయి. ఇప్పటికే వరుస ఎన్కౌంటర్లలో పదుల సంఖ్యలో మావోయిస్టులు మరణించారు. మృతుల్లో పార్టీ అగ్ర నాయకులు సైతం ఉంటుండటంతో మావోయిస్టులకు భారీ నష్టం వాటిల్లుతున్నది.
మావోయిస్టు పార్టీ కలిమెల ఏరియా కమిటీ సభ్యుడిగా పని చేస్తున్న ఛత్తీస్గఢ్ బీజాపూర్ జిల్లా పామేడు పోలీస్స్టేషన్ పరిధి పాలగూడెం గ్రామపంచాయతీ గొమ్ముగూడేనికి చెందిన మడివి ఉంగ అలియాస్ నగేష్ లొంగిపోయినట్లు భద్రాద్రి ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. ఆయనతోపాటు అదే జిల్లా టెర్రామ్ పోలీస్స్టేషన్ పరిధిలోని పువర్తి గ్రామానికి చెందిన మడకం సుక్కి అలియాస్ రోషిణి (కట్ ఆఫ్ ఏరియా కమిటీ సభ్యురాలు) కూడా లొంగిపోయినట్లు చెప్పారు.