గౌహతి: అస్సాంలో జరిగిన రైలు ప్రమాదంలో 8 ఏనుగులు(Elephants Killed) మృతిచెందాయి. సాయిరంగ్-న్యూఢిల్లీ మధ్య నడిచే రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలు ఏనుగుల గుంపును ఢీకొట్టింది. అస్సాంలోని హోజాయ్ వద్ద ఈ ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున 2.17 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు అధికారులు చెప్పారు. దీంతో ఆ మార్గంలో వెళ్తున్న రైళ్లకు అంతరాయం ఏర్పడింది. ఏనుగులను ఢీకొన్న రైలు పట్టాలు తప్పింది. అయిదు బోగీలు డిరేల్ అయ్యాయి. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఎవరికీ గాయాలు కాలేదు.
మిజోరం రాష్ట్రంలో ఐజ్వాల్ సమీపంలో ఉన్న సాయిరంగ్ నుంచి ఢిల్లీలోని ఆనంద్ విహార్ టర్మినల్ వరకు రాజధాని రైలు వెళ్తోంది. గౌహతి పట్టణానికి సుమారు 126 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటన నేపథ్యంలో యాక్సిడెంట్ రిలీఫ్ రైళ్లు, రైల్వే అధికారులు ఆ ప్రాంతానికి హుటాహుటిన వెళ్లారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు. రైలు పట్టాలు తప్పడం వల్ల.. ఏనుగుల శరీర భాగాలు ట్రాక్‌పై చెల్లాచెదురుగా పడినట్లు అధికారులు చెప్పారు.
అస్సాం ఎగువ భాగంతో పాటు ఈశాన్యా రాష్ట్రాలకు వెళ్లాల్సిన రైళ్లకు అంతరాయం ఏర్పడింది. డిరేల్ అయిన కోచ్‌ల్లో ఉన్న ప్రయాణికులను ఇతర కంపార్ట్మెంట్లకు మార్చారు. అయితే ఎలిఫెంట్ కారిడార్ కాని ప్రాంతంలో ప్రమాదం జరగడం అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నది. రైల్వే ట్రాక్‌పై ఏనుగులు ఉన్నట్లు లోకో పైలెట్ గురించాడు. ఆ వెంటనే అతను ఎమర్జెన్సీ బ్రేక్‌లు వేశాడు. అయినా కానీ రైలును ఏనుగులు ఢీకొన్నాయి. ఆ ఫలితంగా రైలు పట్టాలు తప్పింది.