కొత్తగూడెం క్రైం: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు దారుణానికి పాల్పడ్డారు. నక్సల్స్ అమర్చిన ఐఈడీ పేలడంతో 8 మంది జవాన్లు, ఓ డ్రైవర్ ప్రాణాలు కోల్పోయారు. బీజాపూర్ జిల్లాలో సోమవారం ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గడచిన రెండేళ్లలో మొదటిసారి మావోయిస్టులు భద్రతా దళాలపై పెద్ద ఎత్తున విరుచుకుపడ్డారు. ఐజీ(బస్తర్ రేంజ్) సుందర్రాజ్ పీ తెలిపన వివరాల ప్రకారం.. బీజాపూర్ జిల్లాలో డీఆర్జీ భద్రతా దళాలు పఖంజూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో సంయుక్తంగా ఆపరేషన్స్ ముగించుకుని తమ స్కార్పియో వాహనంలో వెనుదిరిగాయి.
ఈ క్రమంలో కుట్రు పోలీస్‌స్టేషన్ పరిధిలోని అంబేలి గ్రామ సమీపంలోకి వాహనం చేరుకోగానే అక్కడ మావోయిస్టులు అమర్చిన మందుపాతర పేలి భారీ విస్పోటం జరిగింది. దీంతో జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం ఒక్కసారిగా గాల్లోకి ఎగిరి పక్కనే ఉన్న చెట్లపై ముక్కలుగా పడింది. అందులో ఉన్న డ్రైవర్‌తోపాటు 8 మంది జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో సమాచారం తెలుసుకున్న భద్రతా దళాలు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను వైద్య సేవల కోసం దవాఖానకు తరలించాయి.
ఘటనా స్థలానికి సమీపంలో ఉన్న అటవీ ప్రాంతాల్లో వందల సంఖ్యలో భద్రతా దళాలు గాలింపు నిర్వహిస్తున్నాయి. మావోయిస్టులు లక్ష్యంగా చేసుకున్న భద్రతా దళాలు జనవరి 3 నుంచి మూడు రోజులుగా నారాయణ్‌పూర్, దంతేవాడ, బీజాపూర్ జిల్లాల సరిహద్దుల్లో నక్సల్స్ వ్యతిరేక ఆపరేషన్ నిర్వహించినట్టు ఐజీ తెలిపారు. గత మూడు రోజుల ఆపరేషన్‌లో ఐదుగురు నక్సలైట్లు, ఓ డీఆర్జీ హెడ్ కానిస్టేబుల్ మరణించారని ఆయన చెప్పారు. దక్షిణ అబూజ్మడ్లోజరిగిన ఆపరేషన్‌లో దంతేవాడ, బీజాపూర్, బస్తర్, కొడగావ్, నారాయణ్‌పూర్‌కు చెందిన సిబ్బందితోపాటు ఎస్టీఎఫ్ సిబ్బంది పాల్గొన్నారని ఆయన తెలిపారు.
ఆపరేషన్ అనంతరం పెట్రోలింగ్ బృందాలు బెద్రే(బీజాపూర్) చేరుకున్నాయని, అక్కడి నుంచి వేర్వేరు వాహనాలలో ఆయా జిల్లా ప్రధాన కార్యాలయాలకు బయల్దేరాయని దక్షిణ బస్తర్ డీఐజీ కమలోచన్ కాశ్యప్ తెలిపారు. దంతేవాడ డీఆర్జీ, బస్తర్ ఫైటర్స్ సిబ్బంది ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీతో నక్సలైట్లు పేల్చివేశారని ఆయన తెలిపారు. ఈ దాడిలో 60 నుంచి 70 కిలోల బరువున్న ఐఈడీని నక్సలైట్లు ఉపయోగించినట్టు కనపడుతోందని, ఫోరెన్సిక్ నిపుణులు వివరాలను సేకరిస్తున్నారని కాశ్యప్ తెలిపారు. ఐఈడీ చాలా పాతదని, ఐఈడీకి కనెక్ట్ చేసిన వైర్లు భూమిలో చాలా లోపలకు ఉన్నాయని, వాటిపై గడ్డి కూడా మొలించిందని, దీన్ని బట్టి చూస్తే ఇది చాలారోజుల క్రితం దీన్ని అమర్చి ఉంటారని ప్రాథమికంగా అంచనాకు వచ్చినట్టు ఆయన తెలిపారు.