Alice D’souza | ముంబై, మే 6: ఆస్తి వివాదంలో 8 దశాబ్దాలుగా సాగిన న్యాయ పోరాటంలో 93ఏండ్ల మహిళ విజయం సాధించారు. దక్షిణ ముంబైలోని రెండు ఫ్లాట్లపై నెలకొన్న వివాదంలో 93 ఏండ్ల మహిళ ఆలిస్ డిసూజాకు అనుకూలంగా బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది. దక్షిణ ముంబైలోని రూబీ మాన్షన్ అపార్ట్మెంట్ మొదటి అంతస్తులో 500, 600 చదరపు అడుగుల రెండు ఫ్లాట్లకు ఆమె యజమానురాలు అవుతారని పేర్కొంటూ మహారాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేసింది.
సదరు ఆస్తిని ఆమెకు అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మార్చి 28, 1942లో ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వం సదరు ప్రయివేటు ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నించింది. అయితే ఈ ప్రయత్నాన్ని విరమిస్తూ జులై 1946లో బ్రిటిష్ ప్రభుత్వం తీర్మానం చేసింది. అయినప్పటికీ ఆ ఆస్తి ఆమెకు దక్కలేదు. 1946నాటి బ్రిటిష్ ప్రభుత్వ ఉత్తర్వులను అమలుజేయాలని, తన ఆస్తిని తనకు ఇవ్వాలని డిసూజా కోర్టును ఆశ్రయించారు. ఆనాటి బ్రిటిష్ ప్రభుత్వ ఉత్తర్వులు సరిగా అమలు చేయకపోవటంతో ఆస్తిని డిసూజా భౌతికంగా స్వాధీనం చేసుకోలేకపోయారని ధర్మాసనం పేర్కొంది.