ముంబై: ఒక వృద్ధురాలు చేతబడి చేస్తున్నట్లుగా గ్రామస్తులు అనుమానించారు. ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆమెను దారుణంగా హింసించి కొట్టారు. కాళ్లు, చేతులపై వాతలు పెట్టారు. బలవంతంగా మూత్రం తాగించారు. కుక్క మలాన్ని తినిపించారు. (Old Woman Thrashed, Forced To Drink Urine) మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు. ఈ దారుణం గురించి తెలిసిన వృద్ధురాలి కుమారుడు, కోడలు కలిసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. చిఖల్దారా తాలూకాలోని రెత్యాఖేడ గ్రామంలో 77 ఏళ్ల వృద్ధురాలు నివసిస్తున్నది.
కాగా, డిసెంబర్ 30న ఆమె కొడుకు, కోడలు పని నిమిత్తం బయటకు వెళ్లారు. అయితే ఇంట్లో ఒంటరిగా ఉన్న ఆ వృద్ధురాలు చేతబడి చేస్తున్నట్లుగా పొరుగువారు అనుమానించారు. గ్రామస్తులు కర్రతో ఆమెను కొట్టారు. చేతులు, కాళ్లపై వాతలు పెట్టారు. బలవంతంగా మూత్రం తాగించడంతోపాటు కుక్క మలాన్ని తినిపించారు. మెడలో చెప్పుల దండ వేసి ఊరేగించారు.
మరోవైపు జనవరి 5న ఆ వృద్ధురాలి కొడుకు, కోడలకు ఈ దారుణం గురించి తెలిసింది. దీంతో స్థానిక పోలీసులకు వారు ఫిర్యాదు చేశారు. పోలీసులు పట్టించుకోకపోవడంతో జిల్లా కలెక్టర్, ఎస్పీకి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. దీంతో పోలీస్ ఉన్నతాధికారులు స్పందించారు.
కాగా, అటవీ ప్రాంతంలో ఉన్న ఆ గ్రామానికి పోలీసులను పంపినట్లు అమరావతి జిల్లా ఎస్పీ విశాల్ ఆనంద్ తెలిపారు. ఈ సంఘటనపై దర్యాప్తు జరిపి తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. స్థానిక పోలీసులు ఈ దారుణాన్ని తొక్కిపెట్టినట్లు తేలితే వారిపై కూడా చర్యలు చేడతామని మీడియాకు వెల్లడించారు.