ముంబై, జూలై 4: బీజేపీ పాలిత మహారాష్ట్రలో అన్నదాతల మరణ మృదంగం కొనసాగుతున్నది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలో రాష్ట్రంలో 767 మంది రైతులు ఉసురు తీసుకున్నారని మహారాష్ట్ర ప్రభుత్వం మంగళవారం అధికారికంగా ప్రకటించింది. అంటే సగటున ప్రతి మూడు గంటలకు ఒకరు దిగుబడి లేక, అప్పుల ఒత్తిడితో ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. పెరిగిపోతున్న అప్పులు, కనీస మద్దతు ధర లేకపోవడం, రుణ మాఫీ జరగకపోవడం, సరైన నీటి సౌకర్యాలు లేకపోవడం ఇవన్నీ రైతుల ఆత్మహత్యలకు ప్రధాన కారణంగా భావిస్తున్నారు. 2024 ఎన్నికల సందర్భంగా విడుదల చేసిన సంకల్ప పత్రంలో రైతుల రుణ మాఫీకి స్పష్టమైన హామీ ఇచ్చిన బీజేపీ తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దానిని మర్చిపోయిందని రైతులు, విపక్షాలు మండిపడుతున్నాయి.
రాష్ట్రంలో రోజురోజుకు రైతుల ఆత్మహత్యలు పెరిగిపోతున్నాయని, వారికి పరిహారం అందడంతో విపరీతమైన జాప్యం జరుగుతున్నదంటూ విపక్ష ఎమ్మెల్సీలు ప్రజ్ఞ రాజీవ్ సతావ్, సతేజ్ పాటిల్, భాయ్ జగన్ ప్రతాప్లు శాసన మండలిలో ప్రశ్నించారు. దీనికి మంత్రి మకరంద్ జాదవ్ లిఖితపూర్వక సమాధానం ఇస్తూ రాష్ట్రంలో ఈ ఏడాది జనవరి నుంచి మార్చి వరకు 767 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని, అందులో 373 కుటుంబాలు ఆర్థిక సహాయానికి అర్హమైనవి కాగా, 200 కుటుంబాలకు అర్హత లేదని చెప్పారు. మిగిలిన 194 కుటుంబాల గురించిన వివరాల సేకరణ జరుగుతున్నదన్నారు. అర్హత పొందిన వారిలో 327 కుటుంబాలకు లక్ష చొప్పున పరిహారం అందజేశామన్నారు.
‘రైతు ఆత్మహత్యలు వ్యవసాయ సంక్షోభానికి కారణం కాదు. అవి ఆ సంక్షోభం ఫలితంగా వస్తున్నవే’ అని వ్యవసాయ నిపుణుడు, ప్రముఖ పాత్రికేయుడు పీ సాయినాథ్ పేర్కొన్నారు. వ్యవసాయ రుణాన్ని రైతేతరులకు మళ్లించడం, వ్యవసాయ వినియోగ (ఇన్పుట్) ఖర్చులు విపరీతంగా పెరగడం, పొలాలపై నియంత్రణ కుటుంబాల నుంచి కార్పొరేట్ నియంత్రణకు మారడం ఇవన్నీ వ్యవసాయ సంక్షోభానికి కారణమేనని ఆయన అన్నారు.