న్యూఢిల్లీ : పదో తరగతి, పన్నెండో తరగతి పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు అర్హత నిబంధనలను సీబీఎస్ఈ కఠినతరం చేసింది. పరీక్షలు రాయడానికి అర్హత పొందాలంటే విద్యార్థులు కనీసం 75 శాతం తరగతులకు హాజరై ఉండాలని తెలిపింది. విద్యాపరమైన, హాజరుకు సంబంధించిన నిబంధనలను నెరవేర్చని విద్యార్థులను పరీక్షలకు అనుమతించేది లేదని స్పష్టం చేసింది. పదో తరగతి, పన్నెండో తరగతి రెండేళ్ల ప్రోగ్రామ్స్ అని పేర్కొంది.
విద్యార్థి పాఠశాలకు హాజరుకాకపోతే, అతని ఇంటర్నల్ అసెస్మెంట్ జరగదని తెలిపింది. ఇంటర్నల్ అసెస్మెంట్లో పనితీరు కనబరచకపోతే, ఆ విద్యార్థి పరీక్షల ఫలితాన్ని ప్రకటించేది లేదని పేర్కొంది. అలాంటి విద్యార్థులను ఎసెన్షియల్ రిపీట్ క్యాటగిరీలో పెట్టనున్నట్లు వివరించింది. అనుమతి లేకుండా సబ్జెక్టులను ఆఫర్ చేయవద్దని అనుబంధ పాఠశాలలను సీబీఎస్ఈ హెచ్చరించింది.