Jal Shakti Ministry | న్యూఢిల్లీ, మే 23: జల, పారిశుద్ధ్య పథకాల అమలులో జలశక్తి మంత్రిత్వ శాఖలో రూ.709 కోట్లకు పైగా ఆర్థిక అవకతవకలు చోటుచేసుకున్నట్టు వెల్లడైంది. 2023-24 సంవత్సరానికి సంబంధించి నిర్వహించిన అంతర్గత ఆడిట్లో ఈ విషయం తేలింది. నిధుల నిలిపివేత, అనధికార వినియోగం, మెషినరీ వృథా, ప్రొక్యూర్మెంట్ విధాన నిబంధనల ఉల్లంఘనను ఈ నివేదిక ఎత్తిచూపింది. ఈ వార్షిక అంతర్గత ఆడిట్ సమీక్ష ప్రకారం 525.98 కోట్ల ప్రభుత్వ నిధులను వాడకుండా బ్లాక్ చేసి ఉంచారు.
అటల్ బహుజల్ యోజన కింద మహారాష్ట్ర, హర్యానాలకు కేటాయించిన నిధులను పూర్తిగా ఖర్చు చేయలేదు. అలాగే కేరళ, బీహార్ రాష్ర్టాల్లో నిధుల వినియోగంలో వృథా ఖర్చులతో పాటు, కేటాయింపుల కన్నా అధికంగా వినియోగించారు. జల్‌శక్తి శాఖలో ఎస్బీఎం-జీ పథకం కింద 7,192 కోట్లు, అటల్ బహుజల్ యోజనకు 1,000 కోట్లు, నేషనల్ హైడ్రాలజీ పథకానికి 500 కోట్లు కేటాయించారు. కాగా, ఇంటర్నెల్ ఆడిట్ వింగ్ కూడా శాఖలో సిబ్బంది కొరత, సవాళ్లను ఎదుర్కొంటున్నదని నివేదిక పేర్కొంది.