న్యూఢిల్లీ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గత ఏడాది జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మరోసారి ఆరోపణలు చేశారు. ఎన్నికలకు ముందు 70 లక్షల మంది కొత్త ఓటర్లు అకస్మాత్తుగా పెరిగినట్లు విమర్శించారు. విశ్లేషణ కోసం ఓటర్ల జాబితా డేటాను ప్రతిపక్ష మహా వికాస్ అఘాడి (ఎంవీఏ)కు ఎన్నికల కమిషన్ (ఈసీ) ఇవ్వాలని డిమాండ్ చేశారు. లోక్‌సభలో ప్రతిపక్ష నేత, రాయ్‌బరేలి ఎంపీ అయిన రాహుల్ గాంధీ సోమవారం సభలో రాష్ట్రపతి ప్రసంగంపై ధన్యవాద తీర్మానంపై చర్చలో పాల్గొన్నారు.
లోక్‌సభ ఎన్నికలు జరిగిన ఐదు నెలల తర్వాత నవంబర్ ఎన్నికలకు మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో భారీగా పేర్లు చేర్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు. ‘నేను మహారాష్ట్ర ఎన్నికల గురించి మాట్లాడాలనుకుంటున్నా. హిమాచల్ ప్రదేశ్ మొత్తం జనాభాను మహారాష్ట్ర ఓటర్ల జాబితాలో చేర్చారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత, అసెంబ్లీ ఎన్నికలకు ముందు 70 లక్షల మంది కొత్త ఓటర్లు అకస్మాత్తుగా మహారాష్ట్రకు వచ్చారు’ అని అన్నారు. విశ్లేషణ కోసం ఓటర్ల జాబితాను ప్రతిపక్ష ఎంవీఏ కూటమికి ఈసీ అందించాలని ఆయన కోరారు.
మరోవైపు రాహుల్ గాంధీ వ్యాఖ్యలను శివసేన ఎంపీ శ్రీకాంత్ షిండే ఖండించారు. నిరాధార ఆరోపణలంటూ తోసిపుచ్చారు. ‘ఈ వ్యాఖ్యలు పూర్తిగా తప్పుడు, నిరాధారమైన వాదనలు. ప్రతి జాబితాను వెబ్సైట్లో ఈసీ అప్లోడ్ చేసింది’ అని మీడియాతో అన్నారు. అయితే ఈ ఆరోపణలను గతంలో ఈసీ తోసిపుచ్చింది. జాబితా నుంచి ఓటర్లను ఏకపక్షంగా చేర్చడం లేదా తొలగించడం సాధ్యం కాదని పేర్కొంది.